అప్పటినుంచి కిచెన్‌లోకి వెళ్లడంలేదు!

18 Nov, 2020 18:52 IST|Sakshi

‘‘ఎంత వాణిజ్య అంశాలున్న సినిమా అయినా కథే ముఖ్యం. ‘మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌’ చిత్రంలో కథే హీరో. కథకి ప్రాధాన్యత ఇస్తే సినిమా బాగుంటుంది. ఇందులో కథకి అనుగుణంగా కామెడీ ఉంటుంది’’ అని హీరోయిన్‌ వర్ష బొల్లమ్మ అన్నారు. సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఆమె తన గురించిన ఎన్నో విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ‘‘నా స్వస్థలం కర్నాటకలోని కొడుగు. అయితే నా పేరు వర్ష బొలమ్మ కావడంతో తెలుగు అమ్మాయేనేమో అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ నేను తెలుగమ్మాయిని కాదు. కానీ తెలుగు మాట్లాడగలను. నాకు వంట రాదు. నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు మా అన్న కోసం ఏదో వండి పెట్టాను.. అది తిన్న తర్వాత తనకి రెండు రోజులు ఆరోగ్యం బాగాలేదు. దీంతో అప్పటి నుంచి కిచెన్‌లోకి వెళ్లడమే మానేశా’’ అంటూ జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు.(చదవండి: నా సినిమాల్లో అన్నయ్య ప్రమేయం ఉండదు)

ఇది రెండో సినిమా
తెలుగులో ‘చూసీ చూడంగానే’ నా మొదటి సినిమా. ‘మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌’ నా రెండో చిత్రం. ఇందులో నా పాత్ర పేరు సంధ్య..  నేనే డబ్బింగ్‌ చెప్పాను. సంధ్య సింపుల్‌ గర్ల్‌. గుంటూరులో పుట్టి పెరిగి చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూసే పాత్ర. నాన్నకు ఎదురు చెప్పదు. సంధ్య పాత్రలో నటనకు బాగా అవకాశం ఉంది. వినోద్‌గారు కథ చెప్పినప్పుడు నిజాయతీ ఉన్న వ్యక్తి అని తెలిసింది.. అందుకే ఆయన్ని నమ్మాను. తెలుగులో రాజ్‌ తరుణ్‌తో ‘స్టాండప్‌ రాహుల్‌’ అనే ఓ సినిమా చేస్తున్నా. తమిళంలో మరో రెండు సినిమాలు చేస్తున్నా’’అని వర్ష బొల్లమ్మ చెప్పుకొచ్చారు. కాగా ఆనంద్‌ దేవరకొండ హీరోగా వినోద్‌ అనంతోజు తెరకెక్కించిన చిత్రం ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’. వర్ష బొలమ్మ కథానాయికగా నటించిన సినిమా ఈ నెల 20 నుంచి అమేజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం కానుంది.(చదవండిఆ సినిమా హక్కులన్నీ ‘జీ’కే సొంతం!)

మరిన్ని వార్తలు