Vijay Deverakonda: ఫ్యాన్స్‌కు కోటి విరాళం.. అవసరం ఉన్న వాళ్లు ఇలా దరఖాస్తు చేసుకోండి: విజయ్‌

5 Sep, 2023 08:13 IST|Sakshi

అర్జున్‌ రెడ్డితో స్టార్‌డమ్‌ తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ.. తర్వాత తన పంతాను మార్చి ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌కు నచ్చే కథలను ఎంచుకుంటూ అభిమానులను మెప్పిస్తున్నాడు. గీత గోవిందం, టాక్సీవాలా చిత్రాల తర్వాత విజయ్‌ దేవరకొండ సరైన విజయం అందుకోలేదు. గత ఏడాది విడుదలైన 'లైగర్‌' ఘోర పరాజయం చూసిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా విడుదలైన 'ఖుషి'తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్నాడు.

(ఇదీ చదవండి:  ప్రియురాలితో బిగ్‌ బాస్‌ ఫేమ్‌ మహేష్ విట్టా పెళ్లి.. శ్రావణి రెడ్డి వివరాలు ఇవే)

సమంత కథానాయికగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల రోజు డివైడ్‌ టాక్‌ వచ్చినా తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుండటంతో భారీగా కలెక్షన్స్‌ వైపు దూసుకుపోతుంది. 'ఖుషి' సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న విజయ్, అభిమానులకు కోటి రూపాయల సాయంతో తన ఉదారతను చాటుకున్నాడు. దీంతో పలువురు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

మూడు రోజుల్లోనే రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు 'ఖుషి' మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సినిమా ప్రమోషన్‌ భాగంగా వైజాగ్ చేరుకున్నాడు విజయ్‌. తన సక్సెస్‌లో అభిమానులను కూడా భాగం చేయడానికి తన రెమ్యూనిరేషన్ నుంచి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున 100 కుటుంబాలకు గాను మొత్తం కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు విజయ్ దేవరకొండ అక్కడ ప్రకటించాడు. దీంతో ఆయన అభిమానులు సర్‌ప్రైజ్‌ అయ్యారు. పదిరోజుల్లొ 100 కుటుంబాలను సెలెక్ట్ చేసి  ఒక్కో ఫ్యామిలీకి లక్ష రూపాయల చొప్పున తానే స్వయంగా అందిస్తానని విజయ్ అన్నారు. 

ఇలా దరఖాస్తు చేసుకోండి
'నా సక్సెస్‌లో, నా హ్యాపీనెస్‌లో మీరు భాగం పంచుకోవాలి. నా సంపాదనను మీతో షేర్ చేసుకోలేకపోతే అంతా వేస్ట్. మీరంతా నా ఫ్యామిలీనే..  దేవర ఫ్యామిలీ, స్ప్రెడింగ్ ఖుషి అని సోషల్ మీడియాలో ఒక అప్లికేషన్ ఫార్మ్ పెడతా. ఇది ఎలా చెయ్యాలో తెలియదు కానీ, అవసరం ఉన్నవాళ్లకి ఏ హెల్ప్ చేసినా నాకు సంతోషమే. మీరు ఉంటున్న ఇంటి రెంట్‌, పిల్లల స్కూల్‌ ఫీజులు ఇలా కొంతైనా నా సాయం ఉండాలనుకుంటున్నా..  


నా సోషల్ మీడియా ఖాతా ద్వారా వివరాలు తెలుపుతా.. ఆర్థికసాయం కావాల్సిన వారు అభిమానులతో పాటు ఎవరైనా దరఖాస్తు చేసుకోండి.. వాటిలో 100 ఫ్యామిలీలను ఎంపిక చేసుకొని సరిగ్గా పదిరోజుల్లొ ఈ మొత్తాన్ని అందజేస్తా. అప్పుడే నాకు ఖుషి సక్సెస్ సంపూర్తి అవుతుంది.' అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. దీంతో విజయ్‌ను సోషల్‌మీడియా ద్వారా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వార్తలు