ప్రేమకు గ్రీన్‌ సిగ్నల్‌!

13 Sep, 2023 00:22 IST|Sakshi

ఉత్తరాది అమ్మాయి రాశీ ఖన్నా హీరోయిన్‌గా దక్షిణాదిలో ఎక్కువ సినిమాల్లో నటించి స్టార్‌ లిస్ట్‌లో ఉన్నారు. రచ్చ గెలిచిన రాశీ ఖన్నా ఇప్పుడు ఇంట అంటే ఉత్తరాదిలో నటిగా నిరూపించుకోవాలని అనుకుంటున్నట్లున్నారు. ఇప్పటికే సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ‘యోధ’ చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు. దిశా పటానీ మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది.

తాజాగా రాశీ మరో కొత్త సినిమాకు పచ్చ జెండా ఊపారని బాలీవుడ్‌ సమాచారం.  నూతన దర్శకుడు బోధయన్‌ రాయ్‌ హీరో విక్రాంత్‌ మెస్సీతో ఓ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ కథను ఇటీవల రాశీకి వినిపించారట. ఈ ప్రేమకథతో ప్రేమలో పడ్డారట ఈ బ్యూటీ. దాంతో ఈ సినిమాలో విక్రాంత్‌ మెస్సీకి ప్రేయసిగా నటించేందుకు రాశీ ఖన్నా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని బీటౌన్‌ సమాచారం. వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి, వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటోందట చిత్ర యూనిట్‌.
 

మరిన్ని వార్తలు