నేను పాడితే లోకమే ఆడదా.. ఉర్రూతలూగించిన షణ్ముఖప్రియ

6 Sep, 2021 07:51 IST|Sakshi

ఉర్రూతలూగించిన షణ్ముఖప్రియ 

ఇండియన్‌ ఐడల్‌ ఫైనలిస్ట్‌కు విశ్వగాన ప్రియ పురస్కారం ప్రదానం 

సాక్షి,విశాఖపట్నం(మద్దిలపాలెం): ఇండియన్‌ ఐడల్‌–12 ఫైనలిస్ట్‌ షణ్ముఖప్రియ రాగాలాపనతో.. విశాఖ సాగరతీరం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆమె సుస్వరాల జల్లులో నగరం తడిసి ముద్దయింది. రాక్‌ సింగర్‌గా తనదైన శైలిలో ఇండియన్‌ ఐడల్‌ వేదికపై ఉర్రూతలూగించిన షణ్ముఖప్రియ.. విశాఖ సంగీత ప్రియులను తన గానంతో మైమరిపించింది. ఇండియన్‌ ఐడల్‌ ముగిసిన తర్వాత తొలిసారిగా ఆదివారం విశాఖ వచ్చిన ఆమెకు నగర ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా గుర్రపు బగ్గీపై ఊరేగించారు. అనంతరం సిరిపురంలోని ఫోర్‌ పాయింట్‌ హోటల్‌లో ఆతీ్మయ అభినందన సభ నిర్వహించారు.  విబాస్‌ మూవీస్‌ ఆధ్వర్యంలో వీరుమామా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో షణ్ముఖప్రియకు నగర మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి విశ్వగాన ప్రియ పురస్కారం ప్రదానం చేశారు.

యంగ్‌ రాక్‌స్టార్‌ ఆఫ్‌ ఇండియాగా వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం కల్పిస్తూ.. గిరిజన కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి చేతులమీదుగా ధ్రువీకరణపత్రం అందజేశారు. వి.విజయకుమార్‌ ఆమెకు రూ.10లక్షలు విలువ చేసే ప్లాట్‌ పత్రాలను బహూకరించారు. అనంతరం మేయర్‌ మాట్లాడుతూ అతి చిన్న వయసులో షణ్ముఖప్రియ ఇండియన్‌ ఐడల్‌ వేదికగా విశాఖ నగర ఖ్యాతిని ఇనుమడింపజేసిందని కొనియాడారు. రాష్ట్ర విద్యా మౌలిక వసతుల, సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌ మళ్ల విజయప్రసాద్‌ మాట్లాడుతూ సంగీత సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి షణ్ముఖప్రియ ఎదిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఆమె తల్లిదండ్రులు రత్నమాల, శ్రీనివాస్‌ మాట్లాడుతూ సొంతగడ్డపై అపూర్వ స్వాగ తం లభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తన గానంతో షణ్ముఖప్రియ సంగీత ప్రియులను ఓలలాడించింది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ పాటలను ఆలపించి, అలరించింది. కార్యక్రమంలో మంత్రి రాజశేఖర్, విశాఖ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, రంజిత్, రోటరీ దొర బాబు, రత్నరాజు, వినీతలు పాల్గొన్నారు.

చదవండి: జూనియర్ ఎన్టీఆర్‌కు 9 సెంటిమెంట్‌ నిజమేనా? 

మరిన్ని వార్తలు