Vijay Sethupathi: విజయ్‌ సేతుపతితో జోడీ కట్టిన సప్త సాగరాలు దాటి హీరోయిన్‌.. షూటింగ్‌..

1 Dec, 2023 12:23 IST|Sakshi

విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి తన 50వ చిత్రం మహరాజాను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా తాజాగా తన 51వ చిత్ర షూటింగ్‌ను పూర్తిచేశారు. 7 సీస్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి ఒరు నల్లనాళ్‌ పార్తు సొల్రేన్‌ చిత్రం ఫేమ్‌ పి.ఆర్ముగకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్‌సేతుపతి, ఆర్ముగకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న రెండవ చిత్రం కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

కాగా ఈ చిత్రం ద్వారా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్‌ కథానాయకిగా కోలీవుడ్‌కు దిగుమతి అవుతున్నారు. నటుడు యోగిబాబు, పీఎస్‌.అవినాష్‌, దివ్యాపిళ్లై, బబ్లు, రాజ్‌కుమార్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతాన్ని, కరణ్‌ బగత్తూర్‌ రావత్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది మలేషియా నేపథ్యంలో సాగే లవ్‌, యాక్షన్‌, సెంటిమెంట్‌తో పాటు మంచి సందేశంతో కూడిన కథా చిత్రంగా ఉంటుందన్నారు.

చిత్ర షూటింగ్‌ మొత్తం మలేషియాలోనే నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. అక్కడ ఇంతకు ముందు ఎవరూ షూటింగ్‌ చేయని కొత్త ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు తెలిపారు. ఇటీవల విజయ్‌సేతుపతి చైనీస్‌ స్టంట్‌ కళాకారులతో పోరాడే భారీ ఫైట్‌ సన్నివేశాలను, ఛేజింగ్‌ సన్నివేశాలను చిత్రీకిరించినట్లు చెప్పారు. పత్తుమలై మురుగన్‌ ఆలయం వద్ద తుది ఘట్ట సన్నివేశాలను రూపొందించినట్లు తెలిపారు.

విజయ్‌ సేతుపతిని చూడడానికి మలేషియాలోని ఆయన అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారని, వారందరికి విజయ్‌సేతుపతి చిరునవ్వుతో అభివాదం చేసి సంతోషపరిచారని చెప్పారు. షూటింగ్‌ పూర్తికావడంతో త్వరలో నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తిచేసి చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు చిత్ర టీజర్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు చెప్పారు.

చదవండి: కెప్టెన్‌ విజయకాంత్‌ మరణించారంటూ వదంతులు.. వీడియో రిలీజ్‌ చేసిన నటుడి భార్య

మరిన్ని వార్తలు