టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన.. ఆ ఇద్దరికీ నో ఛాన్స్‌.. వారి కెరీర్‌లు ముగిసినట్లేనా..?

1 Dec, 2023 12:24 IST|Sakshi

3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం భారత క్రికెట్‌ జట్టు డిసెంబర్‌ 10 నుంచి వచ్చే ఏడాది జనవరి 7 వరకు దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటన కోసం భారత సెలెక్టర్లు నిన్ననే (నవంబర్‌ 30) మూడు వేర్వేరు జట్లను ప్రకటించారు. పరిమిత ఓవర్ల ఫార్మాట​్‌లో సీనియర్లకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు.. టెస్ట్‌ జట్టులో వారికి తిరిగి స్థానం కల్పించారు. 2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భారత్‌ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతుంది. 

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), ప్రసిద్ధ్ కృష్ణలతో కూడిన భారత జట్టు ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుంది. 

అయితే ఈ జట్టులో ఇద్దరు అనుభవజ్ఞులైన ఆటగాళ్ల పేర్లు కనిపించకపోవడంతో క్రికెట్‌ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నయా వాల్‌ చతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానే పేర్లు దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో లేకపోవడంతో వీరి కెరీర్‌లకు ఎండ్‌ కార్డ్‌ పడినట్లేనని అంతా అనుకుంటున్నారు. 

ఇటీవలి కాలంలో వీరిద్దరు స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోవడంతో సెలెక్టర్లు వీరిని పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తుంది. వీరిద్దరికి వయసు (35) కూడా సమస్యగా మారింది. వీరికి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న యువ ఆటగాళ్లు మాంచి ఊపులో ఉండటం కూడా మైనస్‌ పాయింట్‌ అయ్యుండవచ్చు. 

ఇప్పటికిప్పటికీ కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ పుజారా, రహానేలకు ప్రత్యామ్నాయాలు అని చెప్పలేనప్పటికీ..  భవిష్యత్తు మాత్రం వీరిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పుజారా, రహానేలను దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంతో వారి కెరీర్‌లు ఖతమైనట్లేనని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. దక్షిణాఫ్రికా సిరీస్‌లో శ్రేయస్‌, రాహుల్‌ విఫలమైతే తప్ప పుజారా, రహానేలు తిరిగి టెస్ట్‌ జట్టులోకి రాలేరన్నది కాదనలేని సత్యం.  

 
 

మరిన్ని వార్తలు