అడవి నుంచి అసెంబ్లీ దాకా..

16 Oct, 2023 08:43 IST|Sakshi

నకిరేకల్‌ : అడవిబాట పట్టి ఆ తర్వాత జనజీవన స్రవంతిలో కలిసి నకిరేకల్‌ నియోజకవర్గం నుంచి 2014 ఎమ్మెల్యేగా గెలిచారు వేముల వీరేశం. తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఈ ఎన్నికల్లో నకిరేకల్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు.

కుటుంబ నేపథ్యం..
తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన వేముల వీరేశం సీపీఐ(ఎంఎల్‌) నేత యానాల మల్లారెడ్డి స్ఫూర్తితో ప్రగతిశీల ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు ఎదిగారు. తర్వాత సీపీఐ(ఎంఎల్‌) జనశక్తి విప్లవ ఉద్యమంలోకి అడుగుపెట్టాడు. 2004లో ప్రభుత్వ చర్చల సమయంలో జనశక్తి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న వేముల వీరేశం 2005 ఆగస్టులో విజయవాడలో అరెస్టయి కొంతకాలం జైలు శిక్ష అనుభవించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం వీరేశంపై పోలీసులు అక్రమ కేసులు మోపే ప్రయత్నం చేయగా అజ్ఞాతంలోకి వెళ్లాడు. 2007లో సీపీఐ(ఎంఎల్‌) జనశక్తి రాష్ట్ర కార్యదర్శి అమర్‌ అరెస్టు అనంతరం ఆయన బాధ్యతలను వేముల వీరేశం చేపట్టారు. అప్పటి నుంచి 2009 జూలై వరకు వీరేశం అజ్ఞాతంలోనే ఉన్నారు.

2009లో టీఆర్‌ఎస్‌లో చేరిక..
పోలీసుల నుంచి విముక్తి పొందిన వేముల వీరేశం నకిరేకల్‌లో ఉంటూ కోర్టు కేసుల చుట్టూ తిరుగుతూనే 2009లో గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆశీస్సులతో టీఆర్‌ఎస్‌లో చేరారు. 2013లో టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టారు.

ఎన్‌కౌంటర్‌ పేరుతో చంపే ప్రయత్నం
నాటి సీమాంధ్ర పాలకులు ప్రజా ఉద్యమంపై ఉక్కపాదం మోపి వేముల వీరేశాన్ని ఎన్‌కౌంటర్‌ పేరుతో చంపే ప్రయత్నం చేశారు. సుదీర్ఘ కాలంగా విద్యార్థి, విప్లవ ఉద్యమంలో వీరేశం పనిచేసిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలతో సత్సంబంధాలు పెట్టుకొని క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వ్యవస్థ మారాలని, ప్రజల సమస్యలు తీరాలనే లక్ష్యంతో ఉద్యమాలు నడిపారు. అజ్ఞాతంలో ఉన్న వీరేశంను 2009 జూలై 2వ తేదీన హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారు. వీరేశానికి కూతురు, కుమారుడు ఉన్నారు. వీరేశం భార్య పుష్ప కూడా కళాకారురాలిగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రతినిధిగా పని చేశారు.

2014 ఎన్నికల్లో విజయం
తెలంగాణ ఏర్పాటు అనంతరం 2014 సార్వత్రిక ఎన్నికల్లో నకిరేకల్‌ నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కించుకున్న వేముల వీరేశం కాంగ్రెస్‌ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యపై విజయం సాధించారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య చేతిలో ఓటమి పాలయ్యారు.

మరిన్ని వార్తలు