ప్రజల ఆలోచన మారాలి

16 Nov, 2023 07:22 IST|Sakshi

ఎన్నికల్లో కోటీశ్వరులకే టికెట్‌ వస్తుంది.. వారే విజయం సాధిస్తారన్న భావన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఉద్యమిస్తున్నానని చెబుతున్నారు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి చొల్లేటి ప్రభాకర్‌. ప్రస్తుత కాలంలో నాయకులు ఎన్నికలను వ్యాపారంగా మార్చారని ధ్వజమెత్తారు. ఈ పద్ధతి పోవాలని, గుత్తాధిప్యత రాజకీయాలకు స్వస్తి పలకాలని, సమాజంలో కుళ్లును కడగాలని డెమోక్రటిక్‌ ఫోరం ఫర్‌ తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల తీరు, తన అనుభవాలను ‘సాక్షి’తో

పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..

రూ.84 మాత్రమే ఖర్చు చేశా..
2018 శాసనసభ ఎన్నికల్లో నేను నల్లగొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాను. అప్పట్లో కేవలం 84 రూపాయలు మాత్రమే ఖర్చు చేశాను. నాకు 360 ఓట్లు వచ్చాయి. ప్రస్తుత ఎన్నికల్లో నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచాను. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నాను. డబ్బు ప్రమేయం లేకుండా, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయగలిగితే మావోయిస్టులు కూడా సహకరిస్తారు. నేను దంతెవాడ ప్రాంతంలో ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లినప్పుడు.. ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చాను. పోలింగ్‌ పెరిగేలా చూశాను. నెల్సన్‌ మండేలా, అబ్రహం లింకన్‌ అన్నట్లు ‘బ్యాలెట్‌ ఈజ్‌ మోర్‌ పవర్‌ఫుల్‌ ద్యాన్‌ బుల్లెట్‌.’ దీనిని నిజం చేయాలి.

1984 ఐఏఎస్‌గా ఎంపికై న నేను 2016 జూన్‌లో రిటైర్డ్‌ అయ్యాను. ఈ కాలంలో చాలా రాష్ట్రాల్లో పని చేశాను. తెలంగాణలో కూడా పంచాయతీ రాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా విధులు నిర్వర్తించాను. 12 రాష్ట్రాల్లో ఎన్నికల అబ్జర్వర్‌గా పని చేశాను. రిటైర్డ్‌ అయ్యాక డెమోక్రటిక్‌ ఫోరం ఫర్‌ తెలంగాణ సంస్థ ఏర్పాటు చేశాం. నేను రాష్ట్ర కన్వీనర్‌గా, హైకోర్జు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ చంద్రకుమార్‌ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం కావాలని మా ప్రధాన డిమాండ్‌. డబ్బుకు అమ్ముడుపోవద్దని.. మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ఓటర్లలో చైతన్యం తీసుకొస్తున్నాం. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు అందరికీ సమానమని.. దాన్ని ఎందుకు అమ్ముకుంటున్నారన్న దానిపైనే పోరాటం సాగిస్తున్నాం.

డబ్బు రాజకీయాలను ఎన్నికల కమిషన్‌ అడ్డుకోవాలి
ఉమ్మడి ఏపీలో 86 శాతం అక్షరాస్యత ఉండేది. తెలంగాణ విడిపోయిన తర్వాత ఇక్కడ 66 శాతం మాత్రమే అక్షరాస్యత. ఇప్పుడు ఏపీలో 76 శాతం అక్షరాస్యత ఉంది. తెలంగాణలో 34 శాతం నిరక్ష్యరాస్యులు ఉన్నారు. వారిని సొమ్ము చేసుకోవడానికి రాజకీయ నాయకులు ఓట్లను కొనుగోలు చేస్తున్నారు. కొందరు పీహెచ్‌డీ చదివిన వారు కూడా ఓటును అమ్ముకుంటున్నారు. మొన్న మునుగోడు ఉప ఎన్నికలో డబ్బులు ఇస్తేగానీ ఓటు వేయబోమని కొన్నిచోట్ల ఓటర్లు సాయంత్రం వరకు భీష్మించారు. ఇది మారాలి. ఓట్ల కొనుగోలు, డబ్బు రాజకీయాలను అడ్డుకోవడం ఎన్నికల కమిషన్‌కే సాధ్యం. ఈసారి రాష్ట్ర సివిల్‌ పోలీసుల సంఖ్యతో సమానంగా కేంద్ర పారామిలటరీ బలగాలు వచ్చాయి. విస్తృత తనిఖీలతో డబ్బు ప్రవాహాన్ని అడ్డుకోవచ్చు. 22 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రిటీషర్స్‌ పోలీసింగ్‌ వ్యవస్థతోనే మన దేశాన్ని పాలించారు. పోలీస్‌ వ్యవస్థ ద్వారా ఎన్నికల కమిషన్‌ ఓట్ల కొనుగోలును నియంత్రించాల్సిన అవసరం ఉంది.

ఆస్తుల వివరాలు వెల్లడించాలి
ఎన్నికల వ్యవస్థపై యువతలో ఇప్పుడిప్పుడే కొద్దిగా మార్పు వస్తోంది. మీడియా ద్వారా వివిధ పద్ధతుల్లో ఓటర్లలో చైతన్యం తీసుకురావాలి. ఆదాయానికి మించి ఆస్తులున్న వారందరిపై కేసులు పెట్టాలి. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు తమ ఆస్తుల వివరాలు లోక్‌పాల్‌, లోకాయుక్తలో వెల్లడిస్తున్నారు. అలాగే సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలంతా లోక్‌పాల్‌, లోకాయుక్తలో ఆస్తుల వివరాలు పెట్టాలి. డబ్బు పంచకుండా, మద్యం పంపిణీ చేయకుండా ఓట్లు వేయించుకునే శక్తి ఇప్పటి రాజకీయ నాయకులకు లేదు.

మరిన్ని వార్తలు