రాగి జావ తోడై.. గోరుముద్ద బలవర్ధకమై!

22 Mar, 2023 02:30 IST|Sakshi
విద్యార్థులకు రాగిజావను అందిస్తున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ, ఎంపీ పోచా, అధికారులు
● జగనన్న గోరుముద్దలో అదనపు పౌష్టికాహారం ● వారంలో మూడు రోజులు రాగి జావ పంపిణీ ● జిల్లాలో ప్రారంభించిన కలెక్టర్‌, ఎంపీ పోచా, ఎమ్మెల్యేలు, అధికారులు

నంద్యాల: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సంపూర్ణ పౌష్టికాహారం అందించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గోరుముద్దను మరింత బలవర్ధకంగా మార్చింది. గోరుముద్దకు అదనంగా రాగిజావను చేర్చింది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని లాంఛనంగా మంగళవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించగా.. నంద్యాల కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ శామూన్‌, నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మాబున్నిసా, డీఈఓ అనురాధ, విద్యార్థులు హాజరై లైవ్‌ ద్వారా వీక్షించారు. జిల్లా వ్యాప్తంగా ఇదే రోజు కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లాలోని 1369 ప్రభుత్వ పాఠశాలల్లోని 1,52,638 మంది విద్యార్థులకు జగనన్న గోరుముద్దలో భాగంగా 150 ఎం.ఎల్‌ రాగిజావ అందజేశారు. నంద్యాల కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం జగనన్న గోరుముద్దలో భాగంగా వారంలో మూడు రోజుల పాటు రాగిజావ అందిస్తామన్నారు. మరో 3 రోజులు గోరుముద్దలో ఇప్పటికే బలవర్థకమైన చిక్కీని పిల్లలకు ఇస్తున్నారన్నారు. గతంలో కంటే ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకంలో పెను మార్పులు తీసుకొచ్చి రోజుకో మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారంతో కూడిన ఆహార పదార్థాలు అందిస్తున్నామన్నారు. విద్యార్థుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ఐరన్‌, క్యాల్షియం లాంటి పోషకాలు ఉండే బెల్లంతో కూడిన రాగిజావ పంపిణీని సీఎం చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. వీటితో పాటు పిల్లలకు విద్యాకానుక, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశామన్నారు. విద్యార్థులు వీటన్నిటిని సద్వినియోగం చేసుకొని, బాగా చదువుకొని ఉన్నత స్థానానికి ఎదగాలన్నారు. అనంతరం కలెక్టర్‌తో పాటు ఎంపీ, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌, డీఈఓ అనురాధ తదితరులు విద్యార్థులకు రాగి జావ పంపిణీ చేశారు.

● బనగానపల్లెలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విద్యార్థులకు రాగిజావ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న గోరుముద్దలో భాగంగా ఇప్పటికే ఐదు రోజుల పాటు గుడ్డు, మూడు రోజులు చిక్కీలు ఇచ్చారని, ఇప్పటి నుంచి వారంలో మూడు రోజులు రాగిజావ ప్రభుత్వం అందజేస్తుందన్నారు.

● డోన్‌ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మీట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీరాములు, మున్సిపల్‌ చైర్మన్‌ రాజేష్‌, ఎంపీపీ రాజశేఖర్‌రెడ్డిలు విద్యార్థులకు రాగిజావ పంపిణీ చేసి, రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు.

● శ్రీశైల నియోజకవర్గంలోని మహానంది మండలం తమ్మడపల్లె ప్రాథమికోన్నత పాఠశాలలో ఎంపీపీ బుడ్డారెడ్డి యశశ్విణి, జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి, మహానంది దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్‌ కొమ్మ పాల మహేశ్వరరెడ్డిలు విద్యార్థులకు రాగిజావ పంపిణీ చేశారు.

● ఆళ్లగడ్డ పట్టణంలోని ఉన్నత పాఠశాలలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు నాయబ్‌ రసూల్‌, మరియమ్మ, ఎంఈఓ శోభ హైమావతి విద్యార్థులకు రాగిజావ పంపిణీ అందజేశారు.

● పాణ్యం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎంపీపీ హుసేన్‌బీ, మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణ, సర్పంచ్‌ పల్లవి విద్యార్థులకు రాగిజావ పంపిణీ చేశారు.

● నందికొట్కూరులోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో మున్సిపల్‌ చైర్మన్‌ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు పౌష్టికాహారం కింద రాగిజావ అందజేశారు.

మరిన్ని వార్తలు