-

సిరి ధాన్యాల సాగును ప్రోత్సహించండి

22 Mar, 2023 02:30 IST|Sakshi
చిరుధాన్యాల పదార్థాలను పరిశీలిస్తున్న జేసీ

నంద్యాల: సిరి ధాన్యాలను సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహించాలని జాయింట్‌ కలెక్టర్‌ నిశాంతి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వైఎస్‌ఆర్‌ సెంటినరీ హాల్‌ ప్రాంగణంలో అంతర్జాతీయ చిరు ధాన్యాల మహోత్సవాల సందర్భంగా డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్ర, ఐసీడీఎస్‌ తదితర శాఖల సహకారంతో ఏర్పాటు చేసిన సిరిధాన్యాల స్టాళ్లను ఆమె సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్య సంరక్షణకు పోషక విలువలు ఉన్న సిరిధాన్యాలను ఆహారంగా తీసుకోవాలన్నారు. స్టాళ్లలో ఉన్న చిరుధాన్యాల ఆహార పదార్థాలను తిని రుచి చూశారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సైబర్‌ నేరగాళ్లఉచ్చులో పడొద్దు

శ్రీశైలం: శ్రీశైలానికి వచ్చిన భక్తులే లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్లు వల వేస్తున్నారని, వారి ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి సూచించారు. గుర్తు తెలియని నంబర్ల నుంచే ఫోన్లకు వచ్చే ఆన్‌లైన్‌ లింక్‌లను క్లిక్‌ చేయవద్దని హెచ్చరించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బ్యాంక్‌ అకౌండ్‌ బ్లాక్‌ అయిందని, రుణం మంజూరైందని, పాన్‌కార్డ్‌ నంబర్‌ అప్‌డేట్‌ చేయాలని సైబర్‌ నేరగాళ్లు ఫోన్లకు లింక్‌ పంపుతున్నారన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా బ్యాంక్‌ ఖాతాల్లో సొమ్ము మొత్తం స్వాహా చేస్తారన్నారు. బాధితులుంటే సైబర్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1930కు ఫోన్‌ చేయాలన్నారు. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాల్లో విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది అలసత్వం వీడరాదన్నారు. సమావేశంలో ఏఎస్పీ ఆర్‌.రమణ, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ దస్తగిరిబాబు, శ్రీశైలం సీఐ దివాకర్‌రెడ్డి, ఎస్‌ఐ లక్ష్మణరావు, పాల్గొన్నారు.

8 మంది విద్యార్థులు డిబార్‌

నంద్యాల(సిటీ): ఉమ్మడి కర్నూలు జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్‌ పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన ఎనిమిది మంది విద్యార్థులను పరీక్షల చీఫ్‌ సూపరింటెండెంట్‌ సుబ్రమణ్యం డిబార్‌ చేశారు. నంద్యాల జిల్లా డోన్‌ డివిజన్‌ పరిధిలోని ప్యాపిలిలో ఒకరు, కర్నూలు జిల్లా ఆదోని సాయి జూనియర్‌ కళాశాలలో ఒకరు, ఆదోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఐదుగురు, ఎమ్మిగనూరు నారాయణ కళాశాలలో ఒక విద్యార్థి మాల్‌ప్రాక్టీసుకు పాల్పడటంతో డిబార్‌ చేశారు. మంగళవారం జరిగిన పార్ట్‌–3 లో మ్యాథమ్యాటిక్స్‌ పేపర్‌–2, బోటనీ పేపర్‌–2, సివిక్స్‌ పేపర్‌–2 పరీక్షలకు కర్నూలు, నంద్యాల జిల్లాలలో 34,674 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 33,479 మంది హాజరు కాగా 1,195 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు.

27న ఆప్కాబ్‌

చైర్‌పర్సన్‌, ఎండీ రాక

కర్నూలు(అగ్రికల్చర్‌): ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంకు(ఆప్కాబ్‌) చైర్‌పర్సన్‌ ఝాన్సీరాణి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనాథరెడ్డి ఈ నెల 27న నంద్యాల జిల్లాకు రానున్నారు. కర్నూలు జిల్లా సహకార కేంద్రబ్యాంకు రీజినల్‌ కార్యాలయాన్ని నంద్యాలలో వారు ప్రారంభించనున్నారు. జిల్లా సహకార కేంద్రబ్యాంకు ప్రస్తుతం కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఉమ్మడిగానే ఉంది. పరిపాలన సౌలభ్యం కోసం రూ. 15 లక్షలతో నంద్యాలలో రీజినల్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయంతో పాటు నంద్యాల మండలంలో పోలూరు గ్రామంలో రూ.28 లక్షలతో నిర్మించిన పీఏసీఎస్‌ భవనాన్ని, భీమవరం గ్రామంలో రూ.1.50 కోట్లతో నిర్మించిన హెచ్‌పీసీఎల్‌ పెట్రోల్‌ పంపును ప్రారంభిస్తారు. అలాగే గోస్పాడు మండలం యాల్లూరు గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మించిన మినీ ఫంక్షన్‌ హాల్‌ను కూడా వారు ప్రారంభిస్తారని కేడీసీసీ బ్యాంకు అధికార వర్గాలు తెలిపాయి.

29న జెడ్పీ సర్వసభ్య సమావేశం

కర్నూలు(అర్బన్‌): జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఈ నెల 29న జెడ్పీ సమావేశ భవనంలో నిర్వహిస్తున్నట్లు సీఈఓ జి.నాసరరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ద్యం, భూగర్భ జలవనరుల శాఖ, గృహ నిర్మాణం, పశు సంవర్దక శాఖలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు.

మరిన్ని వార్తలు