పార్లమెంట్‌లో మొత్తం 92 మంది ఎంపీల సస్పెన్షన్

18 Dec, 2023 16:20 IST|Sakshi

ఢిల్లీ: పార్లమెంటులో అసాధారణ పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంటు ఉభయ సభల్లో మొత్తంగా 92 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈరోజు లోక్‌సభలో 33 మంది ఎంపీలు, రాజ్యసభలో 45 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. గతవారం 14 మంది ఎంపీలు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై విపక్షాలు గందరగోళం సృష్టించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో నేడు 33 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశంపై లోక్‌సభలో గందరగోళం సృష్టించడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీలు టీఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ ఉన్నారు.

ఈ రోజు సస్పెండ్ అయిన లోక్‌సభ ఎంపీల్లో 31 మందిని శీతాకాల సమావేశాలకు సస్పెండ్ చేయగా.. ముగ్గుర్ని ప్రివిలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్ చేశారు. ఎంపీలు కే జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీక్ స్పీకర్ పోడియంపైకి ఎక్కి నినాదాలు చేశారు. ఈ ఎంపీల సస్పెన్షన్ ప్రతిపాదనను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సభలో సమర్పించారు. వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదించారు. 

సస్పెన్షన్‌పై అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. 'నాతో సహా 33 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. గతంలో సస్పెండ్ చేసిన మా ఎంపీలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండే చేశాం. పార్లమెంటు భద్రతా ఉల్లంఘనపై సభలో హోం మంత్రి అమిత్ షా మాట్లాడాలని కోరాం.' అని చెప్పారు. 

డిసెంబర్ 13న పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం ఘటన జరిగింది. నలుగురు యువకులు పార్లమెంట్‌లోకి చొరబడి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు యువకులు లోక్‌సభ లోపల గ్యాస్‌ బాంబులను ప్రయోగించగా.. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు.

ఈ ఘటన జరిగిన మరుసటి రోజు పార్లమెంట్‌లో విపక్ష సభ్యులు ఆందోళన చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో 14 మంది సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇందులో ఒక రాజ్య సభ సభ్యుడు కాగా, 13 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. ఈ రోజు సస్పెండ్ అయిన ఎంపీలతో కలిపి మొత్తంగా పార్లమెంట్‌లో 47 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. 

ఇదీ చదవండి: Covid 19 Cases: మళ్లీ కరోనా.. కొత్తగా 355 కేసులు.. ఐదుగురు మృతి!

>
మరిన్ని వార్తలు