Rinku Singh: ‘సిక్సర్ల’ కింగ్‌ రింకూ.. 26 ఫోర్లు, 14 సిక్స్‌లు! ఎదురుగా ఎవరున్నా డోంట్‌ కేర్‌!

18 Dec, 2023 16:22 IST|Sakshi

India vs South Africa ODI Series 2023: సౌతాఫ్రికా గడ్డపై టీ20లలో అదరగొట్టిన టీమిండియా ‘నయా ఫినిషర్‌’ రింకూ సింగ్‌ అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. స్టార్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో రెండో వన్డే సందర్భంగా ఈ యూపీ కుర్రాడు ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖాయమైపోయింది. టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో అయ్యర్‌ సౌతాఫ్రికాతో రెండు, మూడు వన్డేలకు దూరం కానున్నట్లు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో అతడి స్థానాన్ని రింకూతో భర్తీ చేయాలని మేనేజ్‌మెంట్‌ ఫిక్సైపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రొటిస్‌తో తొలి వన్డే సందర్భంగా తమిళనాడు బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే అజేయ అర్ద శతకంతో రాణించి తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. కాబట్టి రెండో వన్డేలోనూ ఓపెనర్‌గా సాయి తన స్థానం సుస్థిరం చేసుకోగా.. శ్రేయస్‌ అయ్యర్‌ కారణంగా రింకూకు కూడా మార్గం సుగమైనట్లు తెలుస్తోంది.

రింకూకు తెలిసిందిదే
ఈ నేపథ్యంలో రింకూ సింగ్‌ గురించి ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం. పేద కుటుంబం నుంచి వచ్చిన రింకూ 2013లో తొలిసారి యూపీ అండర్‌–16 జట్టులో చోటు దక్కించుకున్నాడు. బాల్‌ను చూడటం, బలంగా బాదడం.. రింకూకు తెలిసిందిదే. ఇలాంటి దూకుడైన ఆటతో దేశవాళీ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్‌కు ఎన్నో విజయాలు అందించాడు.

అంచెలంచెలుగా ఎదుగుతూ.. అండర్‌–19 జట్టులోనూ చోటు సంపాదించాడు. అప్పటి నుంచి తన కెరీర్‌ మరో మలుపు తిరిగింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ భారీ షాట్లు కొట్టడం, ప్రత్యర్థి బౌలర్‌ ఏ స్థాయి వాడైనా.. అతడిపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడం రింకూ బలాలు. ఇలాంటి అద్భుత నైపుణ్యాలున్న బ్యాటర్‌ను వదులుకోవడానికి ఏ జట్టు మాత్రం ఇష్టపడుతుంది? యూపీ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన రింకూ సింగ్‌ 17 ఏళ్ల వయసులోనే సీనియర్‌ వన్డే, టీ20 టీమ్‌లో చోటు సంపాదించాడు.

దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి
ఈ క్రమంలో త్రిపురతో జరిగిన వన్డేలో 44 బంతుల్లోనే 91 పరుగులు సాధించడం అతడి ప్రతిభకు మరో నిదర్శనంగా నిలిచింది. ఈ మ్యాచ్‌ జరిగిన రెండేళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో ఆడే అవకాశం దక్కింది రింకూకు! ఆ తర్వాత వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు.. దేశవాళీ వన్డే, టీ20, ఫస్ట్‌క్లాస్‌ ఫార్మాట్లలో ఈ లెఫ్టాండర్‌ ప్రధాన ప్లేయర్‌గా మారిపోయాడు. 

దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రింకూ సింగ్‌పై ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల దృష్టి పడింది. సెలక్షన్‌ క్యాంపులలో తన టాలెంట్‌ నిరూపించుకున్న రింకూను తొలుత 2017లో పంజాబ్‌ జట్టు సొంతం చేసుకుంది. రూ. 10 లక్షలు వెచ్చించి అతడిని కొనుగోలు చేసింది. అయితే ఆడే అవకాశం మాత్రం ఇవ్వలేదు.

ఈ క్రమంలో 2018 ఐపీఎల్‌ వేలంలో రూ. 20 లక్షల కనీస ధరతో బరిలో దిగిన రింకూను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఎవరూ ఊహించని రీతిలో రూ. 80 లక్షలకు కొనుగోలు చేసింది. రింకూ కెరీర్‌ను మార్చివేసే ఘట్టానికి పునాది అక్కడే పడింది.

అప్పటి నుంచి సిక్సర్ల కింగ్‌గా
కేకేఆర్‌ కొనుగోలు చేసిన తర్వాత మూడు ఎడిషన్ల పాటు రింకూ అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. అడపాదడపా అవకాశాలు వచ్చినా వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న రింకూ.. గతేడాది నుంచి ఫినిషర్‌గా రాటుదేలాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో 15 బంతుల్లో 40 పరుగులు సాధించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

అయితే, గుజరాత్‌ టైటాన్స్‌తో  మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు బాది కేకేఆర్‌ను గెలిపించడం రింకూ కెరీర్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈ సంచలన ప్రదర్శన రింకూను సిక్సర్ల కింగ్‌గా మార్చడమే గాకుండా.. టీమిండియాలో టీ20 జట్టులో అడుగుపెట్టే సువర్ణావకాశాన్నీ ఇచ్చింది.

ఐర్లాండ్‌ పర్యటనలో టీ20 సిరీస్‌ సందర్భంగా 2023లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన రింకూ.. 8 ఇన్నింగ్స్‌ ఆడాడు. మొత్తంగా 262 పరుగులు సాధించాడు. ఇందులో ఓ హాఫ్‌ సెంచరీ ఉంది. అత్యధిక స్కోరు: 68.

మొత్తం 26 ఫోర్లు, 14 సిక్సర్లు
ఇక రింకూ ఇప్పటి వరకు సాధించిన మొత్తం పరుగుల్లో 26 ఫోర్లు, 14 సిక్సర్లు ఉండటం విశేషం. ప్రస్తుతం టీమిండియాతో కలిసి సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న రింకూ టీ20లలో తనను తాను నిరూపించుకున్నాడు. కఠిన సవాళ్లు విసిరే సఫారీ గడ్డపై తన తొలి హాఫ్‌ సెంచరీని నమోదు చేశాడు. ఇక ప్రొటిస్‌ జట్టుతో మంగళవారం రెండో మ్యాచ్‌ ద్వారా వన్డేల్లోనూ రింకూ ఎంట్రీ ఇవ్వడం లాంఛనమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చదవండి: IPL 2024: నిన్న రోహిత్‌... తాజాగా సచిన్‌ గుడ్‌బై... ముంబై ఇండియన్స్‌లో ఏమవుతోంది?

>
మరిన్ని వార్తలు