Article 370: సుప్రీం కోర్టు తీర్పుపై నిరుత్సాహ పడం: మెహబూబా ముఫ్తీ

11 Dec, 2023 15:57 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.

అయితే ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సుప్రీం కోర్టు తీర్పును బీజేపీ, ఆ పార్టీ నేతలు స్వాగతించగా కశ్మీర్‌లోని   రాజకీయ పార్టీలు, పలువురు నేతలు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు.  ఈ సందర్భంగా  పీపుల్స్‌  డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) చీఫ్‌  మెహబూబా ముఫ్తీ స్పందిస్తూ..  సుప్రీం కొర్టు తీర్పుకు నిరుత్సాహ పడటం లేదు.  ఈ విషయంలో జమ్ము కశ్మీర్‌ ఎన్నో ఒడిదుడుకులు చూసింది. 370 నిబంధన తాత్కాలికమన్న వ్యాఖ్యలతో తాము ఓడిపో​నట్లు కాదు. ఇది భారత దేశ ఆలోచనల ఓటమి.

ప్రస్తుతం జమ్ము కశ్మీర్‌ జైలులా మారింది. దుకాణాలు ఉదయం 10 గంటలలోపు తెరవద్దని ఆదేశించారు. మేము అంతా గృహ నిర్భందంలో ఉన్నాం. ఏళ్ల నుంచి కొనసాగుతున్న రాజకీయం యుద్ధం ఇది. మేము ఇక్కడి నుంచి వెళ్లము. మీమంతా ఏకమై.. కలిసిపోరాడుతాం’అని తెలిపారు.

డొమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ అజాద్‌ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ... సుప్రీకోర్టు తీర్పు చాలా విచారకరం, దురదృష్టకరమైందని తెలిపారు. కానీ సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించాల్సిందేనని పేర్కొన్నారు. 

అదే విధంగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘న్యాయం కోసం ఆశించి సుప్రీంకోర్టు ఆశ్రయించాం. మాకు న్యాయం దక్కుతుందని ఆశించాం. అయితే సుప్రీం కోర్టుపై మాకు గౌరవం ఉంది. మా ప్రయత్నాలు ఇక్కడితో ఆగిపోతాయా? మళ్లీ కోర్టులను ఆశ్రయిస్తామా? అనే దానిపై న్యాయ సంప్రదింపుల అనంతరం ఓ నిర్ణయం తీసుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు