డీకే శివకుమార్‌ భారీ ఆఫర్‌.. తిరష్కరించిన హీరో శివ రాజ్‌కుమార్‌

11 Dec, 2023 09:05 IST|Sakshi

సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. దేశ వ్యాప్తంగా 2024లో జరిగే ఈ ఎన్నికల కోసం అన్నీ రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నాయి. ఈ ఏడాదిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం అందుకున్న కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ సీట్లపై కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు అందరూ ఎన్నికల కోసం సిద్ధం కావాలని కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల కోసం కన్నడ స్టార్‌ హీరో అయిన శివ రాజ్‌కుమార్‌ను ప్రధాన ఆయుధంగా ఉపయోగించుకోవాలనే కాంగ్రెస్‌ ప్లాన్‌కు శివన్న బ్రేకులు వేశాడు.

ఈ క్రమంలో కన్నడ స్టార్‌ హీరో అయిన శివరాజ్‌కుమార్‌కు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎంపీ టికెట్‌ను డీకే శివకుమార్ ఆఫర్‌ చేశారు. కర్ణాటకలో  ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా అక్కడ టికెట్‌ ఇస్తామని శివన్నతో డీకే చెప్పారు. కానీ అందుకు శివరాజ్‌కుమారు నిరాకరించారు. తన ముందు ఐదారు సినిమా ప్రాజెక్ట్‌లు ఉన్నాయని తెలిపారు. దీనికి సమాధానంగా డీకే కూడా ఇలా చెప్పారు... సినిమాలు ఎప్పుడైనా తీయవచ్చు. ఇలాంటి అవకాశం అందరికీ రాదు. ప్రజలకు సేవ చేద్దాం. పార్లమెంటులో మీ లాంటి వారు ఉండాలి. కన్నడిగుల వాయిస్‌ వినిపించాలి.' అని కోరారు.  అప్పటికీ కూడా శివరాజ్‌ కూమార్‌ అంగీకరించలేదు. 

అనంతరం శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ.. 'నేనెప్పటికీ రాజకీయాల్లోకి రాను. మా నాన్న మాకు తెరపై మాత్రమే నటించమని అడిగారు. రాజకీయాల్లోకి వెళ్లాలని ఎప్పుడూ చెప్పలేదు. ముఖానికి రంగులు వేసుకుని నటించి మీ అందరినీ మెప్పించడం మా నాన్నగారు ఇచ్చిన గిఫ్ట్.. అక్కడే నా లైన్ ముగుస్తుంది. వెండితెరపై మా నటన మాత్రమే చూసి అభిమానులు మమ్మల్ని ఆధరించారు. అది చాలు మాకు .. రాజకీయాలు మాకొద్దు.  వాటి కోసం ప్రత్యేకంగా మంచిపని చేసేవాళ్లు కూడా ఉన్నారు. అది వారి పని.. వెండితెరపై నటించడం మాత్రమే నా పని.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప (జనతాదళ్‌ JDS) కూతుర్ని నేను వివాహం చేసుకున్నాను. ఆయన కూడా మమ్మల్ని రాజకీయాల్లోకి రమ్మని ఏనాడు పిలవలేదు. కానీ రాజకీయాలకు అతీతంగా మాత్రమే నా భార్య గీతకు అండగా నిలుస్తాను. తను రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ప్రజలతో మమేకంగా ఉండాలని కోరుకుంటుంది. ఆమె వరకు మాత్రమే నా పాత్ర ఉంటుంది.' అని శివన్న చెప్పాడు. దీంతో కొందరు శివన్న ఫ్యాన్స్‌ సంతోషిస్తున్నారు. రాజకీయాలు వద్దు.. సినిమానే ముద్దు అంటూ కామెంట్లు పెడుతున్నారు. 


(డీకే శివకుమార్‌తో గీత, ఆమె సోదరుడు మధు బంగారప్ప)

గీత జనతాదళ్‌ అభ్యర్థిగా 2013లో పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఈ ఏడాది కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గీత కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సందర్భగా ఆమె డీకే శివకుమార్‌ కాళ్లకు నమస్కరించారు. ఈ చర్యను శివరాజ్‌ కుమార్‌, రాజ్‌కుమార్‌ అభిమానులు అప్పట్లో ఖండించారు. గీత సోదరుడు అయిన మధు బంగారప్ప కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.

>
మరిన్ని వార్తలు