Mizoram Elections Polling Updates: మిజోరంలో 77 శాతానికి పైగా పోలింగ్‌ 

8 Nov, 2023 02:44 IST|Sakshi
మిజోరంలోని మమిట్‌ జిల్లాలో ఓటేసి వేలికున్న సిరాను చూపిస్తున్న వృద్ధ ఓటర్లు 

తొలి ‘ప్రయత్నం’లో ఓటు వేయలేకపోయిన ముఖ్యమంత్రి 

ఐజ్వాల్‌: అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌(ఎంఎన్‌ఎఫ్‌), విపక్ష జోరమ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌(జెడ్‌పీఎం), కాంగ్రెస్‌ మధ్య తీవ్రపోటీకి వేదికగా నిలిచిన మిజోరం శాసనసభ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 40 స్థానాలకూ ఒకే దఫాలో పోలింగ్‌ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు అందిన సమాచారం మేరకు 77.39 శాతం పోలింగ్‌ నమోదైందని అదనపు చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి హెచ్‌.లియాంజెలా చెప్పారు.

సవరించిన తుది ఫలితాలు బుధవారం వచ్చేసరికి పోలింగ్‌ శాతం 80 శాతాన్ని తాకొచ్చు. 18 మంది మహిళలు సహా మొత్తంగా 174 మంది అభ్యర్థులు ఈసారి బరిలో నిలిచారు. రాష్ట్రంలోని 8.57 లక్షల ఓటర్లు ఉన్నారు. సెర్చిప్‌ జిల్లాలో అత్యధికంగా 84.49 శాతం, ఐజ్వాల్‌ జిల్లాలో అత్యల్పంగా 73.09 శాతం పోలింగ్‌ నమోదైంది. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు 7,200 భద్రతా సిబ్బందిని నియోగించారు. పోలింగ్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,276 పోలింగ్‌కేంద్రాలను ఏర్పాటుచేశారు.  

ముఖ్యమంత్రి ఓటేయబోతే మొరాయించింది 
ఐజ్వాల్‌లోని ఒక ఈవీఎం ఏకంగా ముఖ్యమంత్రినే రెండోసారి పోలింగ్‌కేంద్రానికి రప్పించింది. మొదటిసారి మొరాయించడమే ఇందుకు కారణం. ర్యామ్‌హ్యూన్‌ వెంగ్లాయ్‌ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటేసేందుకు ఉదయాన్ని ముఖ్యమంత్రి జోరామ్‌థంగా విచ్చేశారు. అప్పుడే ఈవీఎం మొరాయించింది. చేసేదేం లేక ఇంటికి వెనుతిరిగారు. మళ్లీ 9.40 గంటలకు వచ్చి ఓటేశారు.

‘ ఈసారి కనీసం 25 చోట్ల గెలుస్తాం’ అని సీఎం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు లాల్‌సావ్‌తా ఐజ్వాల్‌ వెస్ట్‌–3 నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 96 ఏళ్ల అంధుడు పూ జదావ్లా పోస్టల్‌ బ్యాలెట్‌ను కాదని స్వయంగా పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటేశారు. పోలింగ్‌ నేపథ్యంలో మయన్మార్, బంగ్లాదేశ్‌ సరిహద్దులను మూసేశారు.

రాకపోకలను ఆపేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఏకంగా 81.61 శాతం పోలింగ్‌ నమోదవడం విశేషం. డిసెంబర్‌ మూడో తేదీన ఓట్లలెక్కింపు ఉంటుంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్‌ఎఫ్‌ 26 చోట్ల గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఉపఎన్నికల్లో మరో రెండు చోట్ల గెలిచింది. విపక్ష జెడ్‌పీఎం ఎనిమిది చోట్ల గెలిచింది. బీజేపీ కేవలం ఒక్క స్థానంలో, కాంగ్రెస్‌ ఐదు చోట్ల విజయబావుటా ఎగరేశాయి. ‘ఈసారి పట్టణప్రాంతాల్లో జెడ్‌పీఎం, గ్రామీణ ప్రాంతాల్లో ఎంఎన్‌ఎఫ్‌ ఎక్కువ సీట్లు గెలవొచ్చు’ అన్న విశ్లేషణలు వినిపించాయి. 

మరిన్ని వార్తలు