చైతన్య భారతి: చరిత్రకు సమకాలీనుడు! మామిడిపూడి వెంకటరంగయ్య

11 Aug, 2022 13:18 IST|Sakshi

1889–1982

మామిడిపూడి వెంకటరంగయ్య ఉన్నత శ్రేణి చరిత్రకారుడు. చారిత్రక ఘటనలతో ప్రేరణ పొంది, ప్రత్యక్ష సాక్షిగా ఉండి ఆ క్రమంలో చరిత్రకారునిగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. వెంకటరంగయ్య నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా పురిణి గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్య పురిణిలోనే సాగింది. 1907 నాటికి పచ్చయప్ప కళాశాలలోనే బీఏ చదువుతున్నారు.

సరిగ్గా అప్పుడే వెంకటరంగయ్య జీవితం మలుపు తిరిగింది. బెంగాల్‌ విభజన (1905) వ్యతిరేకోద్యమంలో భాగంగా బిపిన్‌ చంద్ర పాల్‌ దక్షిణ భారతదేశంలో పర్యటిస్తూ మద్రాస్‌లో దిగారు. వందేమాతరం నినాదం దేశమంతటా ప్రతిధ్వనించిన కాలమది. పాల్‌ మేరీనా బీచ్‌లో ఐదు రోజుల పాటు ప్రసంగాలు చేశారు. ఈ ఐదు రోజులు కూడా ఆయన ప్రసంగాలు విన్నవారిలో వెంకటరంగయ్య కూడా ఉన్నారు.

అదే ఆయనలో కొత్త చింతనకు శ్రీకారం చుట్టింది. తర్వాత వెంకటరంగయ్య పచ్చయప్ప కళాశాలలోనే చరిత్ర ట్యూటర్‌గా చేరారు. ఈ ఉద్యోగంలో ఉంటూనే ఆయన ఎంఏ విడిగా చదివి ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాతి మలుపు కాకినాడకు తిప్పింది. బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడిగారి ఆహ్వానం మేరకు వెంకటరంగయ్య పీఆర్‌ విద్యా సంస్థలో 1910లో చరిత్రోపన్యాసకులుగా చేరారు. ఆ తరువాత విజయనగరం మహారాజా కళాశాలలో బీఏ తరగతులు ప్రారంభించారు.  

1928తో ఆయనకు విజయనగరం బంధం తెగిపోయింది. విజయనగరం సంస్థానం నుంచి  వెంకటగిరి సంస్థానం చేరారు. అక్కడ వెంకటగిరి మహారాజా కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు. అక్కడ నుంచే వెంకటరంగయ్యగారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పిలుపు వచ్చింది. వైస్‌చాన్స్‌లర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వెంకట రంగయ్యను చరిత్ర, రాజనీతి శాఖలో రీడర్‌గా నియమించారు.

ఆ తరువాత అక్కడే ఆయన ప్రొఫెసర్‌ కూడా అయ్యారు. మధ్యలో... అంటే 1949లో బొంబాయి విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్ర విభాగం అధిపతిగా పనిచేశారు.  ఆంధ్రలో స్వాతంత్య్రోద్యమం పేరుతో వెలువరించిన నాలుగు సంపుటాలు చరిత్రకారునిగా వెంకటరంగయ్య ప్రతిభను వెల్లడిస్తాయి. భారత స్వాతంత్య్రం సమరగాథను మూడు సంపుటాలలో ఆయన  రచించారు.  ఆంగ్లంలో కూడా ది వెల్ఫేర్‌ స్టేట్‌ అండ్‌ సోషలిస్ట్‌ స్టేట్, సమ్‌ థియరీస్‌ ఆఫ్‌ ఫెడరలిజమ్‌ వంటి వైవిధ్య భరితమైన రచనలు కనిపిస్తాయి. జీవితంలో ఎక్కువ భాగం విద్యా బోధనకీ, చరిత్ర రచనకీ అంకితం చేసిన వెంకటరంగయ్య  93 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

మరిన్ని వార్తలు