పండగ వేళ రైల్వే స్టేషన్లలో తొక్కిసలాట

12 Nov, 2023 15:56 IST|Sakshi

ఢిల్లీ: దీపావళి వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. కొన్ని మార్గాల్లో రైళ్లు కిక్కిరిసిపోయాయి. టికెట్ ముందే బుక్ చేసుకున్నప్పటికీ రైలులో కాలుపెట్టే పరిస్థితి లేదని కొందరు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే యాజమాన్యంపై విమర్శలు కురిపిస్తున్నారు. అధికారుల నిర్వహణ లోపం వల్ల తాము దీపావళికి ఇంటికి చేరుకోలేకపోయామని సోషల్ మీడియా వేదికగా వాపోయారు.    

"ఇండియన్ రైల్వే నిర్వహణలోపం నా దీపావళిని నాశనం చేసింది. ఏసీ టిక్కెట్‌ను కొన్నప్పటికీ రైలు ఎక్కే పరిస్థితి లేదు. పోలీసుల నుండి ఎటువంటి సహాయం లేదు. నాలాంటి చాలా మంది రైలు ఎక్కలేకపోయారు," అని ట్విట్టర్ వేదికగా ఓ వ్యక్తి పంచుకున్నాడు. 

దేశ రాజధానిలోనూ దీపావళి వేడుకల సందర్భంగా ప్రయాణికులతో బస్సు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఢిల్లీలో ఆనంద్ విహారీ కౌశాంబి ప్రాంతంలో ఇంటర్ స్టేట్ బస్సు టర్మినల్‌లో నడవడానికి కూడా వీలులేని దుస్థితి ఏర్పడింది. పండగ సందర్భంగా జనం సొంత ఊళ్లకు వెళుతున్నారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్‌లు జనంతో నిండిపోయాయి.

న్యూఢిల్లీలోని స్టేషన్లలో రైళ్ల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. శనివారం సూరత్‌లో బీహార్‌కు వెళ్లే ప్రత్యేక రైలు ఎక్కే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మరికొందరు స్పృహతప్పి పడిపోయారని పోలీసులు తెలిపారు. 

ఇదీ చదవండి: సైనికులతో మోదీ దీపావళి వేడుకలు


 

మరిన్ని వార్తలు