భారత్‌లో బంగ్లా మహిళ రహస్య నివాసం.. 30 ఏళ్లకు బయటపడిన బాగోతం!

7 Dec, 2023 13:07 IST|Sakshi

యూపీలోని బరేలీలో గత 30 ఏళ్లుగా అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మహిళ అక్రమంగా భారత్‌కు వచ్చి, ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇక్కడే నివసిస్తోంది. తాజాగా ఆమె పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసిన నేపధ్యంలో ఆమె బాగోతం బయటపడింది. ఈ ఉదంతం పోలీసు శాఖలో కలకలం రేపింది. అక్రమంగా భారత్‌లో ఉంటున్న ఆ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు.

బంగ్లాదేశ్‌లోని జోధోపూర్‌కు చెందిన ఈ మహిళ పేరు అనితా దాస్. ఆమె దేవ్రానియాలోని ఉదయపూర్ గ్రామానికి చెందిన మంగళ్ సేన్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత అతని భార్యగా ఇక్కడే ఉంటోంది. ఆ మహిళ వయస్సు 55 సంవత్సరాలు. అనిత ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నా పోలీసులకు ఆమె గురించి తెలియకపోవడం విశేషం.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం తన తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించడంతో అనిత వారిని చూడటానికి బంగ్లాదేశ్‌ వెళ్లాలని అనుకుంది. ఈ నేపధ్యంలోనే  ఆమె బంగ్లాదేశ్ వెళ్లేందుకు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తులో ఆమె తన స్థానిక చిరునామాతో పాటు బంగ్లాదేశ్ చిరునామాను కూడా రాసింది. అలాగే పాస్‌పోర్ట్‌లో పుట్టిన స్థలం కాలమ్ ఉన్న చోట ఆమె బంగ్లాదేశ్ అని రాయడంతో ఆమె బాగోతం బయటపడింది. 

పాస్‌పోర్ట్ దరఖాస్తు పరిశీలినలో ఆమె బంగ్లాదేశీ అనేది స్పష్టమైంది. వెంటనే నిఘా వర్గాలు రంగంలోకి దిగి ఆమెను అదుపులోకి తీసుకున్నాయి. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు. అక్రమంగా భారత్‌లో ఉంటున్న మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా అనిత బంగ్లాదేశ్‌కు చెందినదనే సంగతి తమకు కూడా తెలియదని గ్రామ ప్రజలు చెబుతున్నారు. అనిత ఈ గ్రామంలో 30 ఏళ్లుగా నివసిస్తోంది. ఆమెకు ఐదుగురు సంతానం. ఇంతకాలం ఆమె స్థానికురాలేనిని గ్రామస్తులంతా భావించారు.
ఇది కూడా చదవండి: గాలి వానలో.. వాన నీటిలో.. రెండేళ్ల చిన్నారిని కాపాడేందుకు..

>
మరిన్ని వార్తలు