Bihar: బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం.. 24 గంటల్లోనే కీలక నిర్ణయం | After Nitish Kumar Switches Sides, First Action Taken Against RJD In Bihar Assembly - Sakshi
Sakshi News home page

Bihar Political Crisis: బీజేపీతో కలిసి నితీష్‌ కొత్త ప్రభుత్వం.. 24 గంటల్లోనే కీలక నిర్ణయం

Published Mon, Jan 29 2024 9:20 AM

After Nitish Kumar switches sides, first action against RJD in Bihar assembly - Sakshi

పట్నా: బిహార్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్‌బంధన్‌ సర్కారుకు గుడ్‌బై చెప్పిన సీఎం నితీష్‌ కుమార్‌ ఎన్డీఏలో చేరిన విషయం తెలిసిందే. బీజేపీతో చేతులు కలిపి తొమ్మిదోసారి బిహార్‌ సీఎంగా అవతరించారు. తాజాగా కొత్త ప్రభుత్వం కొలువు దీరిన మరుసటి రోజే ప్రతిపక్షాలపై చర్యలను ప్రారంభించింది ఎన్డీయే సర్కార్‌.

ఆర్జేడీ నేత, బిహార్‌ అసెంబ్లీ స్పీకర్‌ అవధ్‌ బిహారీ చౌదరిని తన పదవి నుంచి తొలగించాలంటూ అసెంబ్లీ సెక్రటరికీ బీజేపీ, ఆర్డేడీ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం నోటీసులు అందించారు. బీజేపీ నేతలు నంద కిషోర్‌ యాదవ్‌, తార్కిషోర్‌ ప్రసాద్‌(మాజీ డిప్యూటీ సీఎం), హిందుస్తానీ అవామ్‌ మోర్చా అధినేత, మాజీ సీఎం జితన్‌ రామ్‌ మాంఝీ, జేడీయూకు చెందిన వినయ్‌ కుమార్‌ చౌదరి, రత్నేష్‌ సదా, ఎన్డీయే కూటమికి చెందిన ఇతర ఎమ్మెల్యేలు స్పీకర్‌ అవధ్‌ బిహారీ చౌదరిని తొలగించాలంటూ నోటీసులు ఇచ్చారు. 
చదవండి: అందుకే మహా కూటమి నుంచి బయటకొచ్చా: నితీష్

కాగా బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ హమాఘట్‌ బంధన్‌ సంకీర్ణం నుంచి తప్పుకొని మరోసారి బీజేపీ సార్ధంలోని ఎన్డీఏ గూటికి చేరారు. ఆదివారం ఉదయం సీఎం పదవికి రాజీనామా చేసి.. సాయంత్రానికల్లా బీజేపీ మద్దతుతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీంతో 72 ఏళ్ల నితీష్‌ బిహార్‌ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి పగ్గాలు చేపట్టారు.  బీజేపీ నుంచి ఇద్దరు (సామ్రాట్‌ చౌదరి విజయ్‌ కుమార్‌ సిన్హా) ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

నితీశ్‌ చర్యపై కాంగ్రెస్‌తో పాటు విపక్ష ఇండియా కూటమిలోని ఆర్జేడీ, డీఎంకే, జేఎంఎం, ఆప్‌ తదితర పార్టీలు మండిపడ్డాయి. బిహార్‌ ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారన్నాయి. భాగస్వాములను మోసగించడంలో సిద్ధహస్తుడైన ఆయన మరోసారి ఊసరవెల్లి నైజాన్ని చాటుకున్నారంటూ కాంగ్రెస్‌ దుయ్యబట్టింది. నితీశ్‌ వంటి ఆయారాం, గయారాంల    నిష్క్రమణతో ఇండియా కూటమికి నష్టమేమీ లేదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

అధికారమే పరమావధి
2020లో ఏర్పాటైన ప్రస్తుత బిహార్‌ అసెంబ్లీ పదవీకాలంలో నితీశ్‌ సారథ్యంలో ఇది ఏకంగా మూడో ప్రభుత్వం కావడం విశేషం! అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ మద్దతుతో నితీశ్‌ సీఎం అయ్యారు. జేడీ(యూ)లో చీలికకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ 2022లో ఆ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి మహాఘట్‌బంధన్‌ సర్కారును ఏర్పాటు చేశారు.

18 నెలలకే దాన్నీ పడదోసి తాజాగా మరోసారి ఎన్డీఏతో జట్టు కట్టి మళ్లీ సీఎంగా పీఠమెక్కారు. మొత్తమ్మీద కూటములు మారడం నితీశ్‌కు ఇది ఐదోసారి. ఆయన తొలిసారిగా 2000లో బిహార్‌ సీఎం పదవి చేపట్టారు. 2013లో ఎన్డీఏతో 17 ఏళ్ల బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(యూ) ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి నితీశ్‌ కుమార్‌ తప్పుకున్నారు. కానీ 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తోకలిసి పోటీ చేసి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 2017లో తిరిగి ఎన్డీఏ గూటికి చేరి 2022 దాకా అందులో కొనసాగారు. 

Advertisement
Advertisement