బర్డ్‌ఫ్లూ కల్లోలం: 381 వలస పక్షులు బలి 

8 Jan, 2021 09:37 IST|Sakshi

హిమాచల్‌ప్రదేశ్‌లో మరో 381 వలస పక్షులు బలి 

న్యూఢిల్లీ: భారత్‌లో బర్డ్‌ఫ్లూ (హెచ్‌5ఎన్‌8) పంజా విసురుతోంది. పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో పక్షులు మృత్యువాత పడుతున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లో గురువారం 381 వలస పక్షులు ప్రాణాలు విడిచాయి. కర్ణాటకలో 6, గుజరాత్‌లో 4 కాకులు మరణించాయి. కేరళలో వేల సంఖ్యలో కోళ్లు, బాతులు మృతిచెందాయి. కేంద్ర బృందం కొట్టాయం, అలప్పుజా జిల్లాలో పర్యటిస్తోంది. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో 9 కాకులు మరణించాయి. బర్డ్‌ఫ్లూ వ్యాప్తి పెరుగుతుండడంతో పలు ఉత్తరాది రాష్ట్రాల్లో హైఅలర్ట్‌ విధించారు. ఇతర రాష్ట్రాల నుంచి కోళ్ల దిగుమతులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఢిల్లీ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇప్పటివరకు కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌లో మాత్రమే బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయినట్లు కేంద్రం స్పష్టం చేసింది. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. బర్డ్‌ఫ్లూతో మరణించిన పక్షులను దహనం చేసేందుకు పీపీఈ కిట్లు, ఇతర పరికరాలు సిద్ధం చేసుకోవాలని వెల్లడించింది. ఈ వ్యాధిపై, నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కలి్పంచాలని కోరింది. పక్షులు, జంతు మాంసం తినేవారు బాగా ఉడికించిన తర్వాతే తినాలంది.

కేరళలో రైతులకు నష్ట పరిహారం  
కేరళలోని అలప్పుజా, కొట్టాయం జిల్లాల్లో ఇప్పటిదాకా 69 వేలకు పైగా కోళ్లు, బాతులు మరణించాయి. వాటిని పెంచుతున్న రైతులకు నష్టపరిహారం అందజేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో బర్డ్‌ఫ్లూతో మరణించిన వలస పక్షుల సంఖ్య 3,409కు చేరింది. చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ జిల్లాలోనూ కాకులు ప్రాణాలు కోల్పోయాయి. కర్ణాటకలో మృతిచెందిన కాకుల నమూనాలను పరీక్షల కోసం పంపినట్లు మంత్రి  చెప్పారు. గుజరాత్‌ రాష్ట్రం మెహసానా జిల్లాలోని ప్రఖ్యాత సూర్య దేవాలయంలో 4 కాకులు మరణించినట్లు అధికారులు చెప్పారు. ఒడిశాలో బర్డ్‌ఫ్లూ అడుగు పెట్టకుండా కఠిన చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

మరిన్ని వార్తలు