బఘెల్‌కు ‘బోనస్‌’ దక్కలేదు

4 Dec, 2023 05:01 IST|Sakshi

ఛత్తీస్‌గఢ్‌లో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. రెండు పారీ్టలూ అంతే పోటాపోటీగా సంక్షేమ, ప్రజాకర్షక పథకాలను  ప్రకటించాయి. వరికి దేశంలోనే అత్యధికంగా అందిస్తూ వస్తున్న బోనస్‌ తమను గట్టెక్కించి అధికారాన్ని నిలబెడుతుందని ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘెల్‌ పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. మోదీ హామీల పేరుతో బీజేపీ ప్రకటించిన పథకాలకే ప్రజలు జై కొట్టారు.  

ఎదురుదెబ్బ నేపథ్యంలో..
వరుసగా 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండటంతో ప్రజల్లో నెలకొన్న తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గట్టి దెబ్బ కొట్టింది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఆ వెంటనే సీఎం బఘెల్‌ పలు సంక్షేమ, ప్రజాకర్షక పథకాల అమలు ప్రారంభించారు. రైతులు, గిరిజనులు, పేదలను ఎవరినీ వదలకుండా అందరికీ సాయం అందేలా చూశారు. ముఖ్యంగా వరికి ఆయన అందిస్తున్న బోనస్‌ సూపర్‌ హిట్టయింది. మళ్లీ గెలిస్తే పథకాన్ని మరింత విస్తరిస్తామని కూడా కాంగ్రెస్‌ ప్రకటించింది. ఇది ఒక దశలో బీజేపీని బాగా కలవరపరిచింది. దీనికి తోడు భూమిలేని కార్మికులకు వార్షిక ఆర్థిక సాయం రూ.10,000కు పెంచుతామని, కేజీ టు పీజీ ఉచిత విద్య, 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్‌ సహా పలు హామీలెన్నో కాంగ్రెస్‌ ఇచి్చంది.

దాంతో ‘మోదీ గ్యారంటీలు’ పేరుతో బీజేపీ దూకుడుగా ఎన్నో పథకాలు ప్రకటించింది. క్వింటాకు రూ.3,100 చొప్పున ఎకరాకు 21 క్వాంటాళ్లను సేకరిస్తామని పేర్కొంది. ప్రతి వివాహితకూ ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం, పీఎం ఆవాస్‌ యోజన కింద 18 లక్షల ఇళ్ల నిర్మాణం,  పేదలకు రూ.500కే వంట గ్యాస్‌ సిలిండర్, కాలేజీ విద్యార్థులకు ప్రయాణ భత్యం, నిరుపేద కుటుంబంలో పుట్టే ఆడపిల్లకు రూ.1.5 లక్షలు తదితరాలెన్నో ప్రకటించింది. వీటికి తోడు ప్రధాని మోదీ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలతో హోరెత్తించారు. డబుల్‌ ఇంజన్‌ సర్కారుకు చాన్సిస్తే అభివృద్ధి పథంలో పరుగులు తీయిస్తామని చెప్పుకొచ్చారు. ఇవన్నీ ప్రజలపై బాగా ప్రభావం చూపాయి. చివరికి బఘెల్‌ సంక్షేమ పథకాలు, కాంగ్రెస్‌ కొత్త హామీల కంటే బీజేపీ ‘మోదీ గ్యారంటీ’ల వైపే ప్రజలు మొగ్గు చూపారు.

ముంచిన ‘మహదేవ్‌’ ఆరోపణలు...
మోదీ గ్యారంటీలకు తోడు, పోలింగ్‌ సమీపించిన వేళ సీఎం బఘెల్‌పై ముసురుకున్న బెట్టింగ్‌ యాప్‌ ముడుపుల ఆరోపణలు కాంగ్రెస్‌కు బాగా చేటు చేశాయి. ఈ ఉదంతంలో ఒక కొరియర్‌ను అరెస్టు చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రకటించడం, దుబాయ్‌కి చెందిన మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ నుంచి బఘెల్‌కు ఏకంగా రూ.508 కోట్ల మేరకు ముడుపులు అందించినట్టు అతడు చెప్పాడని పేర్కొనడం సంచలనం రేపింది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

>
మరిన్ని వార్తలు