చాలా భావోద్వేగానికి గురయ్యాను

4 Dec, 2023 01:01 IST|Sakshi

షారుక్‌ ఖాన్‌

‘‘డంకీ’ సినిమాలోని ‘నికలె ది కబీ హమ్‌ ఘర్‌ సే..’ పాట తొలిసారి విన్నప్పుడు చాలా  భావోద్వేగానికి గురయ్యాను’’ అని బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘డంకీ’. రాజ్‌కుమార్‌ హిరాణి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తాప్సీ పన్ను, బొమన్‌ ఇరాని, విక్కీ కౌశల్, విక్రమ్‌ కొచ్చర్, అనీల్‌ గ్రోవర్‌ కీలక పాత్రల్లో నటించారు. జియో స్టూడియోస్, రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్మెంట్, రాజ్‌కుమార్‌ హిరాణి ఫిల్మ్స్‌పై గౌరీ ఖాన్, రాజ్‌కుమార్‌ హిరాణి, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. క్రిస్మస్‌ కానుకగా ఈ సినిమా ఈ నెల 21న విడుదలకానుంది.

ప్రీతమ్‌ చక్రవర్తి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నికలె ది కబీ హమ్‌ ఘర్‌ సే..’ పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది. కాగా ‘హ్యాష్‌ట్యాగ్‌ ఆస్క్‌ ఎస్‌ఆర్‌కే’ సెషన్స్‌లో భాగంగా అభిమానులు, నెటిజన్స్‌తో మాట్లాడిన షారుక్‌ ఖాన్‌ పలు విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా ‘నికలె ది కబీ హమ్‌ ఘర్‌ సే..’ పాటని తొలిసారి విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది?’ అనే ప్రశ్నకు షారుక్‌ ఖాన్‌ మాట్లాడుతూ–‘‘ఆ పాట నా తల్లిదండ్రులను, నా స్నేహితులను గుర్తు చేసింది. అలాగే ఢిల్లీలో నేను గడిపిన నాటి రోజులు జ్ఞాపకం వచ్చాయి. చాలా భావోద్వేగానికి గురయ్యాను’’ అని బదులిచ్చారు.

మరిన్ని వార్తలు