Christmas: దేశమంతటా క్రిస్మస్‌ వెలుగులు

25 Dec, 2023 07:59 IST|Sakshi

దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోని చర్చిల్లో ఆకర్షణీయమైన అలంకరణలు చేశారు. కోల్‌కతాలోని చర్చిలు రంగురంగుల దీపాలతో కళకళలాడాయి. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లను మరింతగా పెంచారు. క్రిస్మస్‌తో పాటు రానున్న న్యూ ఇయర్  సందర్భంగా పర్యాటక ప్రదేశాల్లో జనం రద్దీ  మరింతగా పెరిగింది.
 

క్రిస్మస్‌కు ముందుగానే హిమాచల్‌లోని పర్యాటక ప్రదేశాలకు పర్యాటకుల రాక మొదలయ్యింది. పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడంతో సోలాంగ్‌లో దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దీంతో వందలాది వాహనాలు జామ్‌లో చిక్కుకున్నాయి. ఆదివారం రాత్రి 10.30 గంటల వరకు జామ్ కొనసాగింది.
 

కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్.. క్రిస్మస్ ఈవ్ వేడుకలతో సందడి చేస్తోంది. భారీ సంఖ్యలో జనం రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. ప్రత్యేక సామూహిక ప్రార్థనలకు చర్చిలు దీపాలతో ముస్తాబయ్యాయి. పార్క్ స్ట్రీట్‌తో పాటు, హరీష్ ముఖర్జీ రోడ్‌తో సహా కోల్‌కతాలోని ఇతర ప్రదేశాలలో క్రిస్మస్ పండుగ సందర్భంగా భారీ అలంకరణలు కనిపించాయి. సెయింట్ పాల్స్ కేథడ్రల్ చర్చితో పాటు పలు చర్చిలను రంగురంగుల లైట్లతో అలంకరించారు.
 

ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రాత్మక రోమన్ క్యాథలిక్ చర్చ్ క్రిస్మస్ కోసం ప్రత్యేకంగా అలంకరించారు. ఈ చారిత్రాత్మకమైన చర్చిని బసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గ్రేస్ అని పిలుస్తారు. ఈ చర్చి ఉత్తర భారతదేశంలో అతిపెద్దది. యూరోపియన్ సైనికుడు వాల్టర్ రెయిన్‌హార్డ్ సోంబ్రేను వివాహం చేసుకున్న 14 ఏళ్ల ముస్లిం బాలిక బేగం సమ్రు ఈ చర్చిని నిర్మించారని చెబుతుంటారు.
 

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని చర్చిలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించారు. చర్చిల్లో క్రిస్మస్‌ పాటలు వినిపిస్తున్నాయి. మిజోరంలోని అన్ని ప్రాంతాల్లో క్రిస్మస్‌ శోభ కనిపిస్తోంది. క్రిస్మస్.. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చేసుకునే పండుగ. ప్రతీయేటా ఈ పండుగను డిసెంబర్ 25న జరుపుకుంటారు.
ఇది కూడా చదవండి: చుక్కలు చూపించిన పప్పులు, కూరగాయలు!
 

>
మరిన్ని వార్తలు