Uddhav Thackeray: ఉద్ధవ్‌ థాక్రేకు ఊహించని షాక్.. ‘మహా’ పాలిటిక్స్‌లో మరో ట్విస్ట్‌

13 Jul, 2022 16:11 IST|Sakshi

Shiv Sena leader Uddhav Thackeray.. మహారాష్ట్రలో పొలిటికల్‌ వాతావరణం ఇంకా చల్లబడలేదు. బీజేపీ మద్దతుగా శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ మాజీ సీఎం ఉద్ధవ్‌ థాక్రేకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 

తాజాగా.. ఉద్ధవ్‌ థాక్రేకు మరోసారి ఊహించని దెబ్బ తగిలింది. ఎన్‌డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధి ద్రౌప‌ది ముర్ముకు శివ‌సేన చీఫ్ ఉద్ధ‌వ్ ఠాక్రే మ‌ద్ద‌తు తెల‌ప‌డం మ‌హా వికాస్ అఘ‌డి (ఎంవీఏ)లో  ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉద్ధవ్‌ థాక్రే నిర్ణయంపై కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బాలాసాహెట్‌ థోరట్‌.. శివసేనసై సంచలన విమర్శలు చేశారు. 

కాగా, బాలాసాహెబ్‌ ట్విట్టర్‌ వేదికగా.. శివ‌సేన ఎందుకు ద్రౌప‌ది ముర్ముకు మద్దతు ఇస్తుందో తెలపాలని డిమాండ్‌ చేశారు.  ఎన్‌డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధికి మ‌ద్ద‌తు ఇచ్చే ముందు ఎందుకు ఎంవీఏ కూటమితో చ‌ర్చించ‌లేద‌ని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని బేఖాతరు చేస్తూ అప్ర‌జాస్వామిక ప‌ద్ధ‌తిలో మ‌హారాష్ట్ర‌లో ఎంవీఏ స‌ర్కార్‌ను కూల్చి, శివ‌సేన ఉనికినే స‌వాల్ చేసిన బీజేపీ కూట‌మికి రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో శివ‌సేన ఎలా మద్ద‌తు ఇస్తుంద‌ని ప్ర‌శ్నించారు. 

మరో అడుగు ముందుకేసి.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక భిన్న సిద్ధాంతాల మ‌ధ్య‌ పోరుగా మారింద‌ని, ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌, రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాటం కోసం సాగుతోందని అన్నారు. అంతా వారి ఇష్టమేనా(శివసేన) అని పరోక్షంగా కామెంట్స్‌ చేశారు. ఇదిలా ఉండగా.. శివసేన వైఖరిపై అటు నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ద్రౌప‌ది ముర్ముకు మ‌ద్ద‌తిచ్చే విష‌యంలో ఎంవీఏకు శివ‌సేన ముంద‌స్తు స‌మాచారం ఇవ్వ‌లేద‌ని వెల్లడించింది. కాగా, మహారాష్ట్రలో శివసేన.. కాంగ్రెస్‌, ఎన్సీపీ భాగస్వామ్యంతో(ఎంవీఏ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు