ఓబీసీ సర్టిఫికెట్‌ దుమారం: శరద్‌ పవార్‌ కౌంటర్‌ 

14 Nov, 2023 18:07 IST|Sakshi

కులాన్ని దాచుకోను..కుల రాజకీయాలు అసలే చేయను: ఎన్సీపీ  చీఫ్‌

 నా కులం ఏమిటో ప్రపంచానికి తెలుసు: శరద్‌ పవార్‌

Sharad Pawar నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వర్గానికి చెందిన వ్యక్తి అంటూ  ఒక సర్టిఫికెట్‌ సోషల్ మీడియాలో  వైరల్‌  కావడంతో శరద్‌పవార్‌ స్పందించారు. కులాన్ని దాచుకోవాల్సిన అవసరం తనకు లేదని, కులాన్ని అడ్డం పెట్టుకుని తాను ఏనాడూ రాజకీయాలు  చేయలేదని మంగళవారం  ప్రకటించారు.  

తన కులం ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. తాను ఏనాడూ కులం ఆధారంగా రాజకీయాలు చేయలేదు.. చేయను కూడా అని  పవార్‌  ప్రకటించారు. కానీ సమాజంలోని సమస్యలను పరిష్కారం తాను చేయాల్సింది చేస్తానని పవార్ వెల్లడించారు. ఓబీసీ సామాజికవర్గం పట్ల తనకు పూర్తి గౌరవం ఉందని, అయితే తాను పుట్టిన కులాన్ని దాచిపెట్టడం తనకు ఇష్టం ఉండదన్నారు.   అయితే మరాఠా కమ్యూనిటీ కోటాపై మాట్లాడుతూ, రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిధిలోని దన్నారు. మరాఠాలకు రిజర్వేషన్లపై యువత సెంటిమెంట్ చాలా తీవ్రంగా ఉందని కానీ ఈ విషయంలో నిర్ణయాధికారం మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు.

ఎన్సీపీ ఎంపీ, పవార్ కుమార్తె సుప్రియా సూలే ఇది నకిలీదని ఇప్పటికే దీన్ని  కొట్టిపారేశారు. శరద్ పవార్ 10వ తరగతి చదువుతున్నప్పుడు ఇంగ్లీషు మీడియం స్కూళ్లు ఉండేవా ప్రజలు ఆలోచించాలని ఆమె కోరారు. ఇది ఫేక్‌ సర్టిఫికెట్‌ అని శరద్ పవార్ మద్దతుదారు వికాస్ పసల్కర్  గట్టిగా వాదించారు. అసలు శరద్ పవార్ అలాంటి  సర్టిఫికెట్ ఏదీ తీసుకోలేదని ఆయన పరువు తీసేందుకు జరుగుతున్న కుట్ర అని  మండిపడ్డారు. నాగ్ పూర్ కేంద్రంగా ఇలా జరుగుతోందని పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు.

మహారాష్ట్రలో  మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ ఇటీవల రాష్ట్రమంతటా తీవ్ర హింసకు దారితీసింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మరాఠా సంఘం పెద్దఎత్తున నిరసనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం  వివాదానికి దారి తీసింది.
 

మరిన్ని వార్తలు