వ్యాక్సిన్‌ పంపిణీపై నిపుణుల కమిటీ భేటీ నేడు!

12 Aug, 2020 08:20 IST|Sakshi

న్యూఢిల్లీ : కోవిడ్‌–19 నిరోధక టీకాను దేశవ్యాప్తంగా పంపిణీ చేయడం ఎలా అన్న అంశంపై బుధవారం నిపుణుల కమిటీ భేటీ జరగనుంది. నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వి.కె.పాల్‌ నేతృత్వంలోని ఈ కమిటీ టీకా సేకరణ, నైతిక వితరణ వంటి పలు కీలక అంశాలపై చర్చించనుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. టీకా తయారీదారులతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర భాగస్వాములందరితోనూ కమిటీ సంప్రదింపులు జరుపుతుందని, టీకా పంపిణీ విషయంలో ప్రాథమ్యాలు, వాటిని నిల్వ చేసేందుకు శీతలీకరణ వ్యవస్థలు ఎక్కడెక్కడ ఉండాలి? టీకా వేసే వారికి శిక్షణ ఎలా ఇవ్వాలి? వంటి అంశాలపై కమిటీ ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ఆరోగ్య శాఖ విడుదల చేసిన ట్వీట్‌ ఒకటి తెలిపింది. (చదవండి : 6.42 లక్షల పరీక్షలు.. 82,647 కేసులు )

దేశీయంగా అభివృద్ధి చేస్తున్న రెండు టీకాలూ తొలిదశ మానవ ప్రయోగాలు ఇప్పటికే పూర్తికాగా, ప్రస్తుతం రెండో దశ మానవ ప్రయోగాలు నడుస్తున్నాయని భారత వైద్య పరిశోధన సమాఖ్య డైరెక్టర్‌ డాక్టర్‌ బలరామ్‌ భార్గవ మంగళవారం తెలిపారు. ఈ రెండు టీకాల్లో ఒకదాన్ని భారత్‌ బయోటెక్‌ కోవాక్సిన్‌ పేరుతో అభివృద్ధి చేస్తూండగా, జైడస్‌ కాడిల్లా, భారత వైద్య పరిశోధన సమాఖ్యలు సముక్తంగా రెండో టీకాను అభివృద్ధి చేస్తున్నాయి. మరోవైపు పుణే కేంద్రంగా పనిచేస్తున్న సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ, అభివృద్ధి చేస్తున్న టీకా తయారీకి లైసెన్స్‌ పొందిన విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు