సూట్‌బూట్‌ సర్కారు అర్థం చేసుకుంటుందా?

12 Aug, 2020 08:21 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా కష్టకాలంలో ఆర్థిక వ్యవస్థను వృద్ధి బాట పట్టించాలంటే జాతీయ ఉపాధి హామీ పథకానికి మరింత ఊతమివ్వడం, గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదించిన కనీస ఆదాయ గ్యారెంటీ పథకం న్యాయ్‌ను అమలు చేయడం అత్యవసరమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. కరోనా మొదలైనప్పటి నుంచి తాము ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెస్తూనే ఉన్నామని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకం, న్యాయ్‌ వంటివి కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఎంతో ఉపయోగపడతాయని, దేశవ్యాప్తంగా కార్మికులకు లాభం చేకూరుస్తుందని రాహుల్‌ ఒక ట్వీట్‌ ద్వారా తెలిపారు. (సొంత గూటికి పైలట్‌!)

‘‘ఈ సూట్‌బూట్‌ సర్కారు పేదల బాధను అర్థం చేసుకుంటుందా?’’అని విమర్శించారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి ఉన్న డిమాండ్‌ను సూచించే ఓ గ్రాఫ్‌ను కూడా రాహుల్‌ ట్వీట్‌ ద్వారా పంచుకున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో అన్ని జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.7500 నేరుగా వేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ఫించన్‌దారులు, పీఎం –కిసాన్‌ అకౌంట్‌దారులకు కూడా ఇంత మొత్తం ఇవ్వాలని కాంగ్రెస్‌ కోరింది.

మరిన్ని వార్తలు