కోవాగ్జిన్‌... రాష్ట్రాలకు రూ.600

25 Apr, 2021 05:54 IST|Sakshi

ప్రైవేట్‌ ఆస్పత్రులకు రూ.1,200 డోస్‌

ధరలు ప్రకటించిన భారత్‌ బయోటెక్‌

న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ భారత్‌ బయోటెక్‌ తమ కోవిడ్‌–19 వ్యాక్సిన్‌.. ‘కోవాగ్జిన్‌’ ధరలను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.600 డోసు చొప్పున సరఫరా చేస్తామని, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.1,200లకు డోసు చొప్పున అందజేస్తామని భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణా ఎల్లా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొద్దిరోజుల కిందట అనుమతించిన విషయం తెలిసిందే.

ఉత్పత్తిదారులు 50 శాతం వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి... మిగతా 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా అమ్ముకోవడానికి వీలుకల్పించింది. అయితే మే 1లోగా వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులు తమ ధరలను బహిరంగంగా ప్రకటించాలని కోరింది. ప్రస్తుతం దేశంలో రెండు సంస్థల వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అస్ట్రాజెనెకా– ఆక్స్‌ఫర్డ్‌లు అభివృద్ధి చేసిన టీకాను పుణేకు చెందిన సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ కోవిషీల్డ్‌ పేరుతో తయారు చేస్తోంది. కోవిషీల్డ్‌ను రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400లకు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600లకు అందజేస్తామని సీరమ్‌ ఇదివరకే ప్రకటించింది. కేంద్రానికి రూ.150కే డోసును సరఫరా చేస్తూ... రాష్ట్రాలకు, ప్రైవేటుకు అధికధరలను నిర్ణయించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు స్వేచ్ఛనిచ్చి జనంపై భారం మోపుతోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పుడు కోవాగ్జిన్‌ అంతకంటే చాలా ఎక్కువగా ధరలు నిర్ణయించడం గమనార్హం. సీరమ్‌తో పోలిస్తే రాష్ట్రాలకు ప్రతిడోసుకు రూ.200 అధికంగా వసూలు చేయనుంది. ప్రైవేటుకైతే ఏకంగా రెండింతలు ధరను నిర్ణయించింది.   ముందస్తు ఒప్పందంలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి ఇదివరకట్లాగే తాము ఉత్పత్తి చేసేవాటిలో 50 శాతం టీకాలను రూ.150కి డోసు చొప్పున సరఫరా కొనసాగిస్తామని కృష్ణా ఎల్లా చెప్పారు. అయితే బహిరంగ మార్కెట్లో ఈ నష్టాన్ని పూడ్చుకోవడం అవసరమని పేర్కొన్నారు. భవిష్యత్తు ఆవిష్కరణలకు పెట్టుబడుల సమీకరణకు ఇది తప్పదని, కోవిడ్‌–19కు ముక్కుద్వారా వేసే టీకా, చికున్‌గున్యా, జికా వైరస్‌లకు టీకాలను అభివృద్ధి చేయడానికి నిధుల ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు