ఆ డబ్బుతో కాంగ్రెస్‌ పార్టీకి సంబంధం లేదు: ఎంపీ ధీరజ్‌ ప్రసాద్‌

16 Dec, 2023 13:51 IST|Sakshi

ఢిల్లీ:  ఒడిశా కేంద్రంగా మద్యం వ్యాపారం చేస్తున్న ఓ సంస్థకు సంబంధించి పలు ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ(ఐటీ) సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటన అధికారులు ఆశ్చర్యపోయే విధంగా ఏకంగా రూ.351 కోట్లు పట్టుబడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  అయితే ఆ మద్యం వ్యాపార సంస్థతో కాంగ్రెస్‌ పార్టీ  రాజ్యసభ సభ్యుడు ధీరజ్‌ ప్రసాద్‌ సాహూకు సంబంధం ఉన్నట్లు బీజేపీ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేశారు.

తాజాగా ఈ వ్యవహారంపై మొదటిసారిగా కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్‌ప్రసాద్‌ స్పందించారు. ఐటీ దాడుల్లో పట్టుబడిన డబ్బు తనది కాదని తెలిపారు. ఆ డబ్బు తన కుటుంబ సభ్యులు, వారి వ్యాపార సంస్థలకు చెందినవని స్పష్టం చేశారు. కావాలంటే తన అకౌంట్‌ వివరాలను వెల్లడించడానికి సిద్ధమని తెలిపారు.

‘నాపై వస్తున్న ఆరోపణలకు విచారం వ్యక్తం చేస్తున్నా. ఐటీ దాడుల్లో పట్టుబడిన డబ్బు నాకు చెందినవి కావు. దాడుల్లో పట్టబడిన డబ్బుకు కాంగ్రెస్‌ పార్టీ, ఇతర పార్టీలతో ఎటువంటి సబంధం లేదు. ఆ సొ​మ్ము నాది కాదు. నా కుటుంబ సభ్యులకు చెందిన మద్యం సంస్థలది. నేను నా అకౌంట్‌ వివరాలు ఇవ్వడానికి సిద్ధం’ అని అన్నారు. 

ఐడీ దాడుల్లో పట్టుబడ్డ సొమ్ము తనది కాదని, అది తన కుటుంబ సభ్యులకు చెందినవారిదని తాను ముందే చెప్పినట్లు తెలిపారు. ఐటీ శాఖ ఆ ధనాన్ని.. నల్లధనం అంటుందని తెలిపారు. తాన వ్యాపార రంగంలో లేనని స్పష్టం చేశారు. ఆ డబ్బుపై తన కుటుంబ సభ్యులు సమాధానం చెబుతారని అ‍న్నారు. ఈ విషయంలో ఎవరు ఏం అనుకున్న పట్టుబడిన డబ్బు.. కాంగ్రెస్‌పార్టీకి గానీ, మరే ఇతర పార్టీలకు గాని సంబంధం లేదనని వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు