రాష్ట్రపతి ఎన్నికలు.. విమానంలో మిస్టర్‌ బ్యాలెట్‌ బాక్స్‌కు ప్రత్యేక సీటు..

13 Jul, 2022 08:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో వినియోగించనున్న బ్యాలెట్‌ బాక్సులు విమానాల్లో రాష్ట్రాలకు చేరుకుంటున్నాయి. ఈ మేరకు రాష్ట్రాలకు చెందిన అధికారులతోపాటు విమానాల్లో వారి పక్క సీట్లను బ్యాలెట్‌ బాక్స్‌ల కోసం కేటాయించారు. ఈ మేరకు బాక్సుల కోసం ‘మిస్టర్‌ బ్యాలెట్‌ బాక్స్‌’ పేరిట కేంద్ర ఎన్నికల సంఘం విమాన టికెట్లు కొనుగోలు చేసింది. మంగళ, బుధవారాల్లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బ్యాలెట్‌ బాక్సులు చేరుకొనేలా చర్యలు తీసుకుంది. ఆయా వివరాలను మంగళవారం ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు.

‘మంగళవారం 14 ప్రాంతాలకు బుధవారం 16 ప్రాంతాలకు బ్యాలెట్‌ బాక్సులు విమానాల్లో చేరుకుంటాయి. రాష్ట్రాల నుంచి వచ్చి అధికారుల తిరిగి అదే రోజు ఢిల్లీకి బ్యాలెట్‌ బాక్సులను వెంట తీసుకొస్తారు. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం మరింత పటిష్టత, పారదర్శకత కనబరచాలని రాష్ట్రాల రిటర్నింగ్‌ అధికారులకు సూచించాం. బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పేపర్లు సహా ఎన్నికల సామగ్రి రవాణా, నిల్వల సంబంధ ప్రోటోకాల్‌ మార్గదర్శకాలను రిటర్నింగ్‌ అధికారులు ఖచ్చితంగా పాటించాలి’ అని రాజీవ్‌ చెప్పారు.

బ్యాలెట్‌ బాక్సులు రాష్ట్రాలకు చేరిన తర్వాత శానిటైజ్‌ చేసి సీలు వేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో భద్రపరుస్తారు. ఈ ప్రక్రియ మొత్తం వీడియో తీస్తారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం తదుపరి విమానంలో రాష్ట్రాల అధికారులు బ్యాలెట్‌ బాక్సులను విమానాల్లో ఢిల్లీకి తీసుకురానున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించని కారణంగా బాక్స్‌లను హిమాచల్‌ ప్రదేశ్‌కు రోడ్డు మార్గంలో పంపిస్తారు.

చదవండి: ‘ఒత్తిడి కాదు.. కరెక్ట్‌ నిర్ణయం’ ద్రౌపది ముర్ముకే శివసేన మద్దతు

మరిన్ని వార్తలు