ఏడీబీ ఉపాధ్యక్షుడిగా నియామకం

18 Aug, 2020 16:29 IST|Sakshi

సెప్టెంబర్‌లో కీలక బాధ్యతలు

సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లావాస మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ఉపాధ్యక్షుడిగా సెప్టెంబర్‌లో నూతన బాధ్యతలు చేపట్టనుండటంతో ఆయన ఎన్నికల కమిషనర్‌గా వైదొలిగారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా పదవీవిరమణ చేయనుండటంతో తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా అశోక్‌ లావాస కీలక బాధ్యతలను చేపట్టాల్సి ఉంది. అయితే పూర్తి పదవీకాలం ముగియకుండానే పదవి నుంచి వైదొలగిన రెండవ ఎన్నికల కమిషనర్‌గా అశోక్‌ లావాస నిలిచారు.

ఏడీబీ వైస్‌ ప్రెసిడెంట్‌గా అశోక్‌ నియామకంపై గత వారం ప్రకటన వెలువడింది. ప్రైవేట్‌ రంగ కార్యకలాపాలు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలకు సంబంధించి అశోక్‌ లావాస ను ఉపాధ్యక్షుడిగా నియమించామని, ఆగస్ట్‌ 31న పదవీవిరమణ చేయనున్న దివాకర్‌ గుప్తా స్తానంలో ఆయన నూతన బాధ్యతలు చేపడతారని ఏడీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, అశోక్‌ లావాస హరియాణ క్యాడర్‌కు చెందిన పదవీవిరమణ చేసిన 1980 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. 2018 జనవరిలో ఆయన ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. అశోక్‌ లావాస 2016 జూన్‌ నుంచి అక్టోబర్‌ 2017 వరకూ భారత ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. పర్యావరణ, పౌరవిమానయాన కార్యదర్శిగా కూడా ఆయన వ్యవహరించారు. చదవండి : ఏడీబీ ఉపాధ్యక్షుడిగా అశోక్‌ లావాస

మరిన్ని వార్తలు