గాల్లోకి కరెన్సీ నోట్లు

12 Oct, 2023 08:52 IST|Sakshi

భువనేశ్వర్‌: సిబ్బందితో వాగ్వాదం వలన వినియోగదారులు కరెన్సీ నోట్లు గాల్లోకి విసిరిన విచిత్ర ఘటన స్థానిక భారత రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కార్యాలయం ఆవరణలో బుధవారం చోటుచేసుకుంది. పలువురు వ్యక్తులు చిరిగిన మరియు తడిసిన ఇతరేతర కారణాలతో పాడైన నగదు నోట్లను మార్చి, కొత్త నోట్లు తీసుకునేందుకు రిజర్వ్‌ బ్యాంకును సందర్శించారు. అయితే చెడిపోయిన నోట్లను మార్చుకునేందుకు బ్యాంకు అధికారులు నిరాకరించడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

తీవ్ర నిరుత్సాహానికి గురైన వినియోగదారులు తమ దగ్గర అక్కరకు రాకుండా ఉన్న నగదు నోట్లను గాలిలోకి రువ్వి వినూత్న రీతిలో నిరసన ప్రదర్శించారు. ఫలితంగా రూ.100, రూ.200, రూ.500ల విలువైన చెడిపోయిన కరెన్సీ నోట్లు ఆర్‌బీఐ కార్యాలయం ఆవరణ మరియు ఎదురుగా ఉన్న వీధిలో పడి ఉండడంతో అసాధారణ పరిస్థితి నెలకొంది. చెడిపోయిన కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు వచ్చాం. బ్యాంకు ఉద్యోగులు ఆ నోట్లను స్వీకరించలేదు. అందుకే ఇలా నిరసనగా నోట్లను గాలిలోకి విసిరినట్లు కొంతమంది బాధిత వర్గాలు తెలిపారు. 

నోట్ల మార్పిడి కౌంటర్‌ మూసివేత  
ఈనెల 3వ తేదీ నుంచి చెడిపోయిన నోట్ల మార్పిడి కౌంటర్‌ను మూసివేసినట్లు బ్యాంకు అధికారులు తెలియజేసి వినియోగదారులను నచ్చజెప్పేందుకు విఫలయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని ఖాతాదారులు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి అదుపుతప్పింది. బ్యాంకు అధికారులు, ఖాతాదారుల మధ్య మాటల తూటాలు పేలడంతో పోలీసు సిబ్బంది ఘటనా స్థలాన్ని సందర్శించి ఆందోళనకారులను శాంతింపజేశారు.

తడిసిన, చిరిగిన, మరియు పాడైన నోట్లను మార్చుకోవాలని మరియు నాణేలు, నోట్లను ప్రజల నుంచి లావాదేవీలు లేదా మార్పిడి కోసం స్వీకరించాలని ఇప్పటికే అన్ని బ్యాంకులకు సూచించినట్లు భారత రిజర్వ్‌ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. దీనికోసం ప్రజలు ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాలను సంప్రదించాల్సిన అవసరం లేదన్నారు. ఈ వ్యవహారంలో ఖాతాదారులు, వినియోగదారులకు అసౌకర్యం లేకుండా బ్యాంకు వర్గాలు స్పందించాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు