కేరళ బాంబు పేలుళ్ల ఘటనలో విస్తుపోయే నిజాలు..!

29 Oct, 2023 14:53 IST|Sakshi

తిరువనంతపురం: కేరళ పేలుళ్ల ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రార్థన సెంటర్‌లో టిఫిన్ బాక్స్‌లో పేలుడు సంభవించినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రార్థనలు జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్‌లోకి దుండగులు పేలుడు పదార్ధాలను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. పేలుడు సంభవించిన అనంతరం సెంటర్‌లో దట్టమైన పొగ కమ్ముకుందని స్థానికులు తెలిపారు. భయాందోళనకు లోనైన ప్రజలు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగిందని వెల్లడించారు. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారిందని తెలిపారు. 

కేరళలో ఒకేరోజు మూడు సార్లు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుళ్లల్లో ఒకరు మృతిచెందగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కలమస్సేరి సమీపంలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రేయర్‌ మీట్‌ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రార్థన సమయంలో అందరూ కళ్లు మూసుకొని ప్రార్థనలు చేస్తుండగా ఉదయం 9:47 సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. అనంతరం మరో రెండు మూడు చిన్న పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాదాపు 2,000 మందితో ప్రార్థనలు జరుగినట్లు స్థానికులు తెలిపారు. 

ఎన్‌ఐఏ యాంటీ టెర్రర్ ఏజెన్సీ కేసును విచారిస్తోంది. జాతీయ భద్రతా దళం బృందం కూడా కేరళకు రానుంది. ఈ పేలుళ్లకు కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇది ఉగ్రదాడి అని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో హమాస్ నాయకుడు పాల్గొనడంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పేలుడు సంభవించింది.

పేలుడు ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్‌ స్పందించారు. 'ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. దీనికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నాం. ఉన్నతాధికారులందరూ ఎర్నాకులంలో ఉన్నారు. ఘటనా స్థలానికి డీజీపీ వెళ్లారు. పేలుడు ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం. డీజీపీతో మాట్లాడాను. దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయి. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం' అని అన్నారు. అటు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా కేరళ సీఎం విజయన్‌తో ఫొన్‌లో మాట్లాడారు.  

ఇదీ చదవండి: కేరళలో భారీ పేలుడు.. ఉగ్రదాడి కలకలం!

మరిన్ని వార్తలు