మనసైన మరో ప్రపంచంలోకి... ప్రకృతి అనేది మనిషికి అతి పెద్ద పాఠశాల.

14 Nov, 2023 01:36 IST|Sakshi
స్టాంప్‌కు ఎన్నికైన రిజు పెయింటింగ్‌

కళ

జలపాతాల నుంచి పంటచేల వరకు ప్రతిదీ ఏదో ఒక పాఠం చెబుతూనే ఉంటుంది. అందుకే ప్రకృతి పిల్లలకు నచ్చిన ప్రపంచం. ‘చిల్ట్రన్‌–ఫ్రెండ్లీ వరల్డ్‌’ అంశంపై రిజు వేసిన పెయింటింగ్‌... పిల్లలకూ ప్రకృతి ప్రపంచానికి మధ్య ఉండే అనుబంధానికి అద్దం పడుతుంది. ఈ పెయింటింగ్‌ చిల్డ్రన్స్‌ డే స్పెషల్‌ స్టాంప్‌ కోసం ఎంపికైంది...
 

కేరళ స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక స్టాంప్‌ను విడుదల చేస్తుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అయిదు నుంచి పదకొండవ తరగతి విద్యార్థులు ఈ పోటీలో పాల్గొంటారు. ఈ స్టాంపుల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని పిల్లల సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగిస్తుంటారు. ఈ సంవత్సరం రిజు వేసిన పెయింటింగ్‌ చిల్డ్రన్స్‌ డే స్టాంప్‌ కోసం ఎంపికైంది.

‘చిల్డ్రన్‌–ఫ్రెండ్లీ వరల్డ్‌ థీమ్‌ నన్ను బాగా ఇన్‌స్పైర్‌ చేసింది. ప్రకృతి కూడా గురువులాంటిదే అనే ఐడియాతో ఈ బొమ్మ వేశాను. ప్రకృతి, విద్యాప్రపంచం రెండూ కలిసిపోయి కనిపించేలా బొమ్మ వేశాను’ అంటుంది కోచిలోని సెయింట్‌ థామస్‌ స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న రిజు. ‘రిజు పెయింటింగ్‌ అద్భుతమైన ఊహతో భావగర్భితంగా ఉంది’ అని జ్యూరీ ప్రశంసించింది. ‘నిజంగా చెప్పాలంటే బహుమతి వస్తుంది అనుకోలేదు. నేనే కాదు నా తల్లిదండ్రులు, టీచర్‌లు ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఈ పోటీలో పాల్గొనడంలో భాగంగా రకరకాల స్కెచ్‌లు వేశాను. అయితే అవేమీ నాకు నచ్చలేదు. ఆలోచిస్తున్న కొద్దీ కొత్త కొత్త ఆలోచనలు వచ్చేవి. ఆలోచిస్తున్న క్రమంలో ప్రకృతి ప్రపంచాన్ని పుస్తకంగా అనుకున్నాను. ఆ పుస్తకం తెరుచుకున్నప్పుడు ఆ దారుల్లో పిల్లలు ఉత్సాహంగా పరుగులు తీస్తుంటారు. ఈ ఊహతో పెయింటింగ్‌ వేసినప్పుడు చాలా సంతృప్తిగా అనిపించింది. నేను వేసిన పెయింటింగ్‌ స్టాంప్‌గా ఎంపిక కావడం, స్టాంప్‌లు నాన్న వృత్తిలో భాగం కావడం ఆనందంగా ఉంది ’ అంటుంది రిజు.

రిజు తండ్రి రాజేష్‌ పరక్కాడవు పోస్ట్‌ ఆఫీసులో పోస్ట్‌మ్యాన్‌గా పనిచేస్తున్నారు. ‘రోజూ తప్పకుండా ఏదో ఒక పెయింటింగ్‌ వేస్తుంటుంది రిజు. చిత్రకళకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటుంది. తన పెయింటింగ్‌ స్టాంప్‌గా ఎంపిక కావడం రిజూకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. భవిష్యత్తు్తలో ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను’ అంటున్నారు రిజు తండ్రి రాజేష్‌. బాలల దినోత్సవం సందర్భంగా తిరువనంతపురంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సమక్షంలో ‘చిల్డ్రన్‌–ఫ్రెండ్లీ వరల్డ్‌’ స్టాంప్‌ను అధికారికంగా విడుదల చేస్తారు.

మరిన్ని వార్తలు