హిజాబ్‌ ధరించిన మహిళ పీఎం అవుతారు!

14 Feb, 2022 05:28 IST|Sakshi

ఏదో ఒక రోజు అది ఖాయం

ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ

లక్నో: హిజాబ్‌ ధరించిన మహిళ భారతదేశానికి ఏదో ఒక రోజు ప్రధానమంత్రి అవుతారని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ జోస్యం చెప్పారు. ‘‘హిజాబ్, నిఖాబ్‌ ధరించిన మహిళలు కాలేజీలకు వెళ్తారు. జిల్లా కలెక్టర్లు, మేజిస్ట్రేట్లు, డాక్టర్లు అవుతారు. వ్యాపారవేత్తలుగా రాణిస్తారు. పెద్ద ఉద్యోగాలు చేస్తారు. చూడడానికి నేను బతికి ఉండకపోవచ్చు గానీ హిజాబ్‌ ధరించిన మహిళ ఏదో ఒక రోజు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతుంది. కావాలంటే నేను చెప్పింది రాసి పెట్టుకోండి. హిజాబ్‌ ధరిస్తానని బిడ్డలు కోరితే తల్లిదండ్రులు తప్పకుండా మద్దతిస్తారు. హిజాబ్‌ ధరించడానికి తల్లిదండ్రులు అనుమతి ఇచ్చిన తర్వాత ఇక ఎవరు ఆపుతారో చూద్దాం’’ అని ఒవైసీ పేర్కొన్నారు.

యూపీలో మతతత్వానికి స్థానం లేదు
హిజాబ్‌ విషయంలో అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దినేశ్‌ శర్మ స్పందించారు. రాష్ట్రంలో మతతత్వాన్ని పెంచిపోషించేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీకి ఎంఐఎం బి–టీమ్‌గా మారిపోయిందన్నారు. యూపీలో అభివృద్ధి అనే పరిమళం గుబాళిస్తోందని, ఇక్కడ మతతత్వం అనే కంపు వాసనకు స్థానం లేదని చెప్పారు.

శాంతి భద్రతకు ఢోకా ఉండదు
కర్ణాటకలో హిజాబ్‌ వివాదం నేపథ్యంలో మూసివేసిన పాఠశాలలు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. 10వ తరగతి వరకు క్లాస్‌లు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పాఠశాలలు తెరుచుకున్నా రాష్ట్రంలో శాంతి భద్రతలకు  భంగం వాటిల్లదని, సాధారణ పరిస్థితి కొనసాగుతుందని ముఖ్యమంత్రి బొమ్మై ఆశాభావం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లతో సుహృద్భావ సమావేశాలు నిర్వహించా లని ఆధికారులకు ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు. ప్రి–యూనివర్సిటీ కాలేజీలు, డిగ్రీ కాలేజీల పునఃప్రారంభంపై పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.  హిజాబ్‌ వివాదం వెనుక కొన్ని సంఘాలు, విదేశీ శక్తుల హస్తం ఉందా? అన్నదానిపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు.

మరిన్ని వార్తలు