మా నాన్న పెళ్లి ఆపండి!

7 Mar, 2023 04:02 IST|Sakshi

రెండో పెళ్లి చేసుకుంటున్నాడంటూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన చిన్నారి

పట్నా: ‘పోలీసంకుల్‌.. మా నాన్న రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. మీరే ఎలాగైనా ఆపాలి..’ అంటూ ఓ బాలిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాలిక ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. బిహార్‌లోని షియోహర్‌లో ఇప్పుడు ఇదే ‘టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌’అయ్యింది. షియోహర్‌కు చెందిన మనోజ్‌ కుమార్‌ రాయ్‌కు నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. అందరూ 12 ఏళ్లలోపు వారే. సుమారు రెండేళ్ల క్రితం భార్య చనిపోయింది. దీంతో, అతడు రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు.

తనకున్న సుమారు అరెకరం (ఎకరానికి 32 కతాస్‌ సమానం) భూమిని ఇచ్చేందుకు కాబోయే భార్యతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. శనివారం సాయంత్రం స్థానిక గుడిలో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, మనోజ్‌ కూతుళ్లలో ఒకరైన పదేళ్ల చోటీ కుమారి కొందరు గ్రామస్తులతో కలిసి శనివారం ఉదయం పిప్రాహి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. ‘మా నాన్న మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడు. ఇక మమ్మల్నెవరు చూసుకుంటారు? మా నాన్న లేకుంటే మాకు దిక్కెవ్వరు? ఉన్న భూమినంతా ఆమెకే ఇచ్చేస్తే మేమెలా బతకాలి? ఎలాగైనా, ఈ పెళ్లిని మీరే ఆపాలి’అని బిగ్గరగా ఏడ్చుకుంటూ పోలీసులకు మొరపెట్టుకుంది.

చిన్నారి వినతిపై పోలీసులు మానవతా దృక్పథంతో స్పందించారు. గ్రామ సర్పంచి, ఇతర ప్రముఖులను పిలిపించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. గుళ్లో పెళ్లి ఏర్పాట్లలో ఉన్న మనోజ్‌ను స్టేషన్‌కు పిలిపించారు. రెండో పెళ్లిని రద్దు చేసుకునేందుకు, పిల్లల్ని సరిగ్గా చూసుకునేందుకు ఒప్పించారు. ఈ మేరకు బాండ్‌ పేపర్‌పై అతడితో సంతకం చేయించారు. అనంతరం, తన కూతురు చోటీ కుమారిని తీసుకుని మనోజ్‌ కుమార్‌ ఇంటికి వెళ్లాడు. బాలిక ధైర్యాన్ని చూసి పట్టణవాసులంతా శెభాష్‌ అంటున్నారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు