AFSPA: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

1 Apr, 2022 04:36 IST|Sakshi

సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం

నాగాలాండ్, అస్సాం, మణిపూర్‌లలో పలు జిల్లాలకు మినహాయింపు

హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటన

నేటి నుంచే అమల్లోకి..

న్యూఢిల్లీ/గౌహతి/కోహిమా: ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, అస్సాం, మణిపూర్‌ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష నెరవేరుతోంది. ఆయా రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వివాదాస్పద సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్‌ఎస్‌పీఏ)–1958ను ఎత్తివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సంచలన ప్రకటన చేశారు. అస్సాంలో 23 జిల్లాలు, మరో జిల్లాలో కొన్ని ప్రాంతాలు, మణిపూర్‌లో 6 జిల్లాలు (15 పోలీసు స్టేషన్ల పరిధిలో), నాగాలాండ్‌లో 7 జిల్లాలకు(15 పోలీసు స్టేషన్ల పరిధిలో) ఈ చట్టం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం ట్వీట్లు చేశారు. ఇదొక కీలకమైన అడుగు అని అభివర్ణించారు.

నాగాలాండ్, అస్సాం, మణిపూర్‌లో ఏఎఫ్‌ఎస్‌పీఏ పరిధిలోని ప్రాంతాల సంఖ్యను తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీని నేతృత్వంలోని భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఏప్రిల్‌ 1 (శుక్రవారం) నుంచే ఇది అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈశాన్య భారతదేశంలో తీవ్రవాదానికి చరమగీతం పాడి, శాంతిని స్థాపించడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు, చేపట్టిన చర్యల వల్ల మూడు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భద్రత మెరుగుపడిందని, అభివృద్ధి వేగం పుంజుకుంటోందని హర్షం వ్యక్తం చేశారు. అందువల్లే ఏఎఫ్‌ఎస్‌పీఏ పరిధి నుంచి ఆయా ప్రాంతాలను మినహాయిస్తున్నట్లు స్పష్టం చేశారు.

కొన్ని ప్రాంతాల్లో యథాతథంగా..
అయితే, మూడు రాష్ట్రాల నుంచి సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని పూర్తిగా ఎత్తివేయడం లేదని, కొన్ని ప్రాంతాల్లో యథాతథంగా కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల్లో 2014తో పోలిస్తే 2021లో తీవ్రవాద ఘటనలు 74 శాతం తగ్గిపోయాయని చెప్పారు. భద్రతా సిబ్బంది మరణాలు 60 శాతం, సాధారణ ప్రజల మరణాలు 84 శాతం తగ్గాయని గుర్తుచేశారు. గత కొన్నేళ్లలో 7,000 మంది తీవ్రవాదులు లొంగిపోయారన్నారు.

ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సుకు ఆమోదం!  
2021 డిసెంబర్‌లో నాగాలాండ్‌లో సైనికుల దాడిలో 14 మంది సాధారణ ప్రజలు మృతిచెందిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి ప్రజల వినతి మేరకు ఏఎఫ్‌ఎస్‌పీఏను ఎత్తివేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అస్సాం రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ స్వాగతించారు. మూడు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలను ఏఎఫ్‌ఎస్‌పీఏ నుంచి మినహాయించడం సంతోషకరమని నాగాలాండ్‌ సీఎం నీఫియూ రియో చెప్పారు.

ఏమిటీ చట్టం?
తీవ్రవాదాన్ని అణచివేసి, శాంతిభద్రతలను కాపాడడమే ధ్యేయంగా ఈశాన్య రాష్ట్రాల్లో సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని 1958 సెప్టెంబర్‌ 11 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం సైనిక దళాలకు కొన్ని అధికారాలు దక్కాయి. ముందస్తుగా వారంట్‌ ఇవ్వకుండానే ఎవరినైనా అరెస్టు చేయొచ్చు. సోదాలు నిర్వహించవచ్చు. ఎవరినైనా కాల్చి చంపినా అరెస్టు, విచారణ నుంచి ప్రత్యేక రక్షణ ఉంటుంది. ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ  డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఏఎఫ్‌ఎస్‌పీఏకు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త ఇరోంచాను షర్మిళ 16 ఏళ్లపాటు నిరాహార దీక్ష కొనసాగించారు. 2015లో త్రిపురలో, 2018లో మేఘాలయాలో ఈ  చట్టాన్ని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది.

చదవండి: (కాంగ్రెస్ వల్లే నేను రాజ్యసభకు రాగలిగాను: విజయసాయిరెడ్డి ఛలోక్తి)

మరిన్ని వార్తలు