జూన్‌ నెలలో ఏపీలో 46% వృద్ధి నమోదు

2 Jul, 2022 17:56 IST|Sakshi

కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో గతేడాది జూన్‌ నెలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ గణనీయమైన వృద్ధి సాధించిందని కేంద్ర ఆర్థికశాఖ శుక్రవారం వెల్లడించింది. జూన్‌ నెలలో ఏపీలో 46% వృద్ధితో రూ. 2,987 కోట్ల జీఎస్టీ వసూలైంది. కాగా, గతేడాది జూన్‌లో రూ. 2,051 కోట్ల జీఎస్టీ వసూలైంది. అదే సమయంలో తెలంగాణలోనూ జీఎస్టీ వసూళ్లలో 37% శాతం వృద్ధి నమోదుతో రూ. 3,901 కోట్లు వసూలయ్యాయి.  

కాగా గతేడాది జూన్‌ నెలలో రూ. 2,845 కోట్ల జీఎస్టీ వసూలైంది. మరోవైపు దేశవ్యాప్తంగా గతేడాది జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో 56% వృద్ధితో రూ.1,44,616 కోట్లు జీఎస్టీ వసూలైందని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. గతేడాది జూన్‌లో దేశవ్యాప్తంగా రూ. 92,800 కోట్ల జీఎస్టీ వసూలైంది. జీఎస్టీ వసూళ్లు ప్రారంభమైనప్పటి నుంచి నెలవారీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది ఐదోసారి.

కాగా, ఈ ఏడాది మార్చి నుంచి వరుసగా నాలుగోసారి ఈ మార్కును దాటింది. జూన్‌లో స్థూల జీఎస్టీ ఆదాయంలో సీజీఎస్టీ రూ. 25,306 కోట్లు, ఎస్జీఎస్టీ రూ. 32,406 కోట్లు, ఐజీఎస్టీ రూ. 75,887 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ.40,102 కోట్లతో కలిపి), సెస్‌ రూ. 11,017 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.1,197 కోట్లతో సహా) ఉన్నాయి.

చదవండి: (ఇంకెంత భద్రత?.. ఎంపీ రఘురామపై హైకోర్టు అసహనం)

మరిన్ని వార్తలు