బాలికల సాధికారతకు ప్రాధాన్యం: మోదీ

25 Jan, 2022 05:08 IST|Sakshi

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రతీ అభివృద్ధి కార్యక్రమంలోనూ బాలికా సాధికారతకు పెద్ద పీట వేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అమ్మాయిలకు మర్యాద దక్కేలా, అన్ని రకాల అవకాశాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని  సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ట్వీట్‌ చేస్తూ ‘‘బాలికల సాధికారతపై మాకున్న చిత్తశుద్ధిని జాతీయ బాలికా దినోత్సవం మాకు గుర్తు చేస్తుంది. వివిధ రంగాల్లో అమ్మాయిలు సాధించిన విజయాలను నెమరువేసుకోవడానికి ఇదొక మంచి సందర్భం’’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.  

రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో మాటామంతీ
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వోకల్‌ ఫర్‌ లోకల్‌ ప్రచారానికి మద్దతునివ్వాలని  ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌ గ్రహీతలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని బహుమతి గ్రహీతలతో ఆన్‌లైన్‌లో ముచ్చటించిన ప్రధాని కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ యువతను దృష్టిలో పెట్టుకునే రూపొందిస్తున్నామని అన్నారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ హోలోగ్రామ్‌ విగ్రహావిష్కరణ అంశాన్ని ప్రస్తావిస్తూ దేశం కోసం విధి       నిర్వహణ నేతాజీ ప్రథమ కర్తవ్యమని, దాని నుంచి స్ఫూర్తి పొంది ప్రతీ ఒక్కరూ దేశాభివృద్ధికి పాటు పడాలని పిలుపునిచ్చారు. సృజనాత్మక             ఆలోచనలతో యువత ముందుకు వెళ్లడం దేశానికే గర్వకారణమన్నారు.  

మరిన్ని వార్తలు