పరేడ్‌ గ్రౌండ్‌ సభలో యువతి కలకలం.. సర్దిచెప్పిన ప్రధాని మోదీ

11 Nov, 2023 20:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న బహిరంగ సభలో ఓ యువతి కాసేపు అందరినీ టెన్షన్‌ పెట్టింది. ప్రధాని మోదీ ప్రసంగిస్తు‍న్న సమయంలో ఆమె ఫ్లడ్‌లైట్‌ స్తంభం ఎక్కింది. దీంతో పోలీసులతో పాటు అందరిలో కంగారు నెలకొనగా.. అది గమనించిన మోదీ ఆమెను వారించారు. 

‘‘తల్లీ కిందకు దిగాలి. ఇది మంచిది కాదు. మీతో నేను ఉన్నాను. మీకోసమే ఇక్కడికి వచ్చాను. మీ మాట వినడానికే వచ్చాను. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. మీరు మందకృష్ణ మాట వినాలి’’ అని మైక్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. 

ప్రధాని అలా చెప్పడంతో ఆమె కిందకు దిగింది. కిందకు దిగిన ఆమెను పోలీసులు మందలించి వదిలేసినట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణ అంశంపై మోదీ ప్రసంగిస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.

మరిన్ని వార్తలు