చీలిక దిశగా జేడీ(ఎస్‌)?

17 Oct, 2023 05:46 IST|Sakshi

ఎన్డీఏతో పొత్తుపై పొరపొచ్చాలు

దానితో జత కట్టేందుకు వీల్లేదు

కర్ణాటక జేడీ(ఎస్‌) చీఫ్‌ ఇబ్రహీం

తమదే అసలు పార్టీ అని వాదన

బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని జనతాదళ్‌ (సెక్యులర్‌) చీలిక దిశగా సాగుతున్నట్టు కని్పస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆయన నిర్ణయాన్ని పార్టీ కర్ణాటక విభాగం అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి సి.ఎం.ఇబ్రహీం బాహాటంగా వ్యతిరేకించారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో తాను చేరబోయేది లేదని ఆయన సోమవారం కుండబద్దలు కొట్టారు. పైగా తమ వర్గమే సిసలైన జేడీ(ఎస్‌) అని ఆయన చెప్పుకొచ్చారు! ‘‘దేవెగౌడ, ఆయన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామి బీజేపీతో జట్టు కట్టాలనుకుంటే అది వారిష్టం.

మేం మాత్రం అందుకు మద్దతిచ్చేదే లేదు’’ అని స్పష్టం చేశారు. తద్వారా పార్టీలో చీలిక తప్పదని సంకేతాలిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుని హోదాలో కర్ణాటక విభాగం విషయమై ఏ నిర్ణయమైనా తీసుకునేందుకు తనకు సర్వాధికారాలూ ఉన్నాయని తేల్చి చెప్పారు. బీజేపీతో పొత్తులను వ్యతిరేకిస్తూ పొరుగు రాష్ట్రాల్లో ఎందరో నేతలు పార్టీని వీడారని దేవెగౌడకు ఆయన గుర్తు చేశారు. కనుక బీజేపీతో పొత్తు యోచన మానుకోవాలని సూచించారు. ‘‘జేడీ(ఎస్‌) ఎప్పటికీ ఎన్డీఏతో కలవరాదనేదే మా తొలి నిర్ణయం. ఇక ఈ పొత్తుకు దేవెగౌడ అస్సలు అనుమతించరాదన్నది మా రెండో నిర్ణయం’’ అని పార్టీ నేతలతో భేటీ అనంతరం ఇబ్రహీం మీడియాకు తెలిపారు.

మరిన్ని వార్తలు