బీజేపీతో పొత్తుకు కేరళ ప్రభుత్వం సమ్మతి.. దేవెగౌడ వ్యాఖ్యలపై పినరయి ఆగ్రహం

20 Oct, 2023 18:24 IST|Sakshi

తిరువనంతపురం: బీజేపీతో పొత్తు విషయంలో ఇటీవల మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవెగౌడ చేసిన వ్యాఖ్యలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఘాటుగా స్పందించారు. కర్ణాటకలో బీజేపీతో పొత్తుకు కేరళ సీఎం ఒప్పుకున్నట్లు ఇటీవల హెచ్‌డీ దేవెగౌడ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై విజయన్‌ మాట్లాడుతూ.. దేవెగౌడ ప్రకటన పూర్తి అవాస్తవమని, అసంబద్దమని పేర్కొన్నారు. రాజకీయ స్వలాభం కోసం అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు.

కాగా కేరళలో పినరయి విజయన్‌ పార్టీ సీపీఎంతో పొత్తు కొనసాగిస్తున్న జేడీఎస్‌.. ఇటీవల బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. జీడీఎస్‌ కేరళ యూనిట్‌ కూడా అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబట్టింది. అయితే  తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర సహా జేడీఎస్‌ రాష్ట్ర యూనిట్లన్నీ బీజేపీతో పొత్తుకు సమ్మతించాయని దేవెగౌడ గురువారం ప్రకటించారు.

కేరళ యూనిట్‌ కూడా సమ్మతించింది
ఆయన మాట్లాడుతూ.. కేరళ ప్రభుత్వంలో తాము భాగమేనని పేర్కొన్నారు. అక్కడ తమ పార్టీ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలని తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రాల జేడీఎస్‌ విభాగాలు అర్థంచేసుకొని మద్దతిచ్చాయని తెలిపారు. కేరళలోని లెఫ్ట్‌ ప్రభుత్వంలోని తమ మంత్రి కే కృష్ణన్‌కుట్టి కూడా తన సమ్మతిని తెలియజేశారని పేర్కొన్నారు.పార్టీని కాపాడుకునేందుకు కర్ణాటకలో బీజేపీతో కలిసి ముందుకు వెళ్లేందుకు కేరళ  ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పూర్తి సమ్మతి తెలిపారని దేవెగౌడ పేర్కొన్నారు.

కుమారస్వామిని సీఎం చేసేందుకే..
ఈ వ్యాఖ్యలను తాజాగా పినరయి విజయన్‌ ఖండించారు. జేడీఎస్‌ అధినేత చేసిన ప్రకటన అవాస్తమని పేర్కొన్నారు. కేవలం తన రాజకీయ పరిణామాలను సమర్థించుకునేందుకు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అంతేగాక తన కుమారుడు కుమారస్వామికి ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టేందుకు దేవెగౌడ బీజేపీతో  పొత్తు పెట్టుకున్నాడని దీని ద్వారా తన పార్టీ సిద్ధాంతాలకు వెన్నుపోటు పోడిచారని ఆరోపించారు.
చదవండి: టీనేజర్లు కోరికల్ని నియంత్రించుకోవాలి.. కలకత్తా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

మేం జోక్యం చేసుకోం
కేరళలో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్‌కు(ఎల్‌డీఎఫ్) జెడీఎస్‌ చాలా కాలంగా మిత్రపక్షంగా ఉందని పినరయి విజయన్ పేర్కొన్నారు. జాతీయ నాయకత్వ నిర్ణయాన్ని విబేధించి ఎల్‌డీఎఫ్‌కు తమ నిబద్ధతను కొనసాగిస్తున్నట్లు జేడీఎస్‌ రాష్ట్ర నాయకత్వం ప్రకటించడంపై ప్రశంసలు కురిపించారు. జేడీఎస్ అంతర్గత వ్యవహారాల్లో తాను కానీ, సీపీఎం కానీ జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. అది తమ పద్దతి కాదని తెలిపారు. 

కేరళలో వామపక్ష పార్టీతోనే..
ఎల్‌డీఎఫ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జేడీఎస్‌ ఎమ్మెల్యే కె కృష్ణన్‌కుట్టి.. దేవెగౌడ ప్రకటనను శుక్రవారం ఖండించారు. తాను కేరళ జీడీఎస్‌ అధ్యక్షుడు మాథ్యూ టీ థామస్‌ కలిసి దేవెగౌడను కలిశామని, బీజేపీలో చేరడంపై తమ అభ్యంతరం తెలియజేశామని చెప్పారు. కేరళలో వామపక్ష పార్టీతోనే(సీపీఎం) కలిసి ఉండాలని రాష్ట్ర యూనిట్‌ నిర్ణయించుకున్నట్లు  పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు