న్యాయమూర్తులపైనే దాడులా? చీఫ్ జస్టిస్ సీరియస్‌

15 Dec, 2023 12:36 IST|Sakshi

ఢిల్లీ: సమాజంలో న్యాయాన్ని కాపాడేవారు న్యాయమూర్తి. అలాంటి హోదా ఉన్న వ్యక్తి అంటే గౌరవం ఉంటుంది. కానీ అలాంటి జడ్జికే లైంగిక వేధింపులు ఎదురైతే? ఉత్తరప్రదేశ్‍లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. పని ప్రదేశంలో సహచర సీనియర్ న్యాయమూర్తులు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని ఓ మహిళా జడ్జి ఆరోపించారు. స్థానికంగా న్యాయ పోరాటం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో చనిపోవడానికి అనుమితి ఇవ్వాలని కోరుతూ చీఫ్ జస్టిస్‌కు లేఖ కూడా రాశారు. 

ఉత్తరప్రదేశ్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా జడ్జి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ' ప్రజలకు సేవలు చేసే న్యాయమూర్తి వృత్తిలో తక్కువ కాలంలోనే నాకు గొప్ప అగౌరవం జరిగింది. కొన్ని నెలలుగా జిల్లా న్యాయమూర్తి, ఆయన అనుచరులు నాపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. నన్ను పురుగు కంటే హీనంగా చూస్తున్నారు. రాత్రి పూట జిల్లా న్యాయమూర్తిని ఒంటరిగా కలవమంటున్నారు' అని ఆ మహిళా జడ్జి తన లేఖలో పేర్కొన్నారు.

'ఈ అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాను. కానీ ఎలాంటి చర్యలు లేవు. హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీని సంప్రదించాను. కానీ, ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ కేసులో సాక్షులు ఆ జిల్లా న్యాయమూర్తి కింద పనిచేసేవారే. సాక్షులు ప్రభావితం కాకుండా దర్యాప్తు పూర్తయ్యేంత వరకు సదరు న్యాయమూర్తిని మరో చోటుకు బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశాను. కానీ నా అభ్యర్థనను కొట్టివేశారు. ఏడాదిగా ఈ బాధ అనుభవిస్తున్నా. నేను బతికుండి ప్రయోజనం శూన్యం. గౌరవప్రదంగా చనిపోవడానికి అనుమతినివ్వండి' అంటూ లేఖలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ దృష్టికి వచ్చింది. దీనిపై నివేదిక ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టును ఆదేశించారు. ఈ అంశంపై స్టేటస్ అప్‌డేట్ కోరాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ ఎం కుర్హేకర్‌ను చీఫ్ జస్టిస్ ఆదేశించారు. తదనంతరం,  అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు కుర్హేకర్ లేఖ రాశారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ నుంచి కూడా నివేదికను కోరారు. 

ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి ఘటన: ప్రతిపక్షాల తీరుపై అమిత్ షా ఫైర్

>
మరిన్ని వార్తలు