కాంగ్రెస్‌ ఓటమికి కమల్‌నాథ్‌ కారణం.. సంజయ్‌ రౌత్‌

3 Dec, 2023 19:59 IST|Sakshi

Madhya Pradesh Elections results: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమికి కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ కారణమని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కొన్ని సీట్లను ‘ఇండియా’ (INDIA) కూటమిలోని భాగస్వామ్యులతో పంచుకుని ఉంటే మరోలా ఉండేదన్నారు.

మిత్రపక్షాల పట్ల పాత పార్టీ తన వైఖరిని పునరాలోచించాలని కూడా ఆయన సూచించారు. ఎన్నికల సమయంలో సమాజ్‌వాదీ పార్టీతో సీట్లు పంచుకోవాలనే ఆలోచనను కమల్‌నాథ్‌ వ్యతిరేకించారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ వంటి నేతలు చురుగ్గా ప్రచారం చేసినప్పటికీ మధ్యప్రదేశ్‌లో ఓటమికి కమల్‌నాథ్‌ కారణమని, విపక్ష కూటమితో కలిసి కాంగ్రెస్‌ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. అఖిలేష్ పార్టీకి (సమాజ్‌వాదీ పార్టీ)  కొన్ని ప్రాంతాలలో మంచి మద్దతు ఉందని, ఆ పార్టీకి కంచుకోటలుగా పేరుగాంచిన 10-12 స్థానాలు ఉన్నాయన్నారు. కానీ దీనిని కమల్‌నాథ్ వ్యతిరేకించారన్నారు.

ఈ ఎన్నికల ఫలితాలు విలువైన గుణపాఠం చెబుతాయని, రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి సమిష్టిగా పాల్గొనాలని రౌత్ ఉద్ఘాటించారు. కాంగ్రెస్ తన వ్యూహాన్ని పునరాలోచించాలని, మిత్రపక్షాల వైపు దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక రాహుల్ గాంధీ “పనౌటీ” వ్యాఖ్య మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల ఫలితాలను దెబ్బతీసిందనే ఆరోపణలను రౌత్ తోసిపుచ్చారు. “అలా అయితే, ఆ వ్యాఖ్య తెలంగాణలో ఎందుకు దెబ్బతీయలేదని ప్రశ్నించారు. కాగా డిసెంబరు 6న ఇండియా బ్లాక్‌ సమావేశానికి పిలుపునిచ్చామని, ఈ సమావేశంలో పలు విషయాలు చర్చిస్తామని రౌత్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు