రాజస్థాన్‌  సీఎం పీఠం ఎవరిది? జైపూర్ కీ బేటీ? బాలక్‌నాథ్?

3 Dec, 2023 17:18 IST|Sakshi

రాజస్థాన్‌లో భారతీయ జనతా పార్టీ రాజస్థాన్‌ను కాంగ్రెస్ నుండి కైవసం చేసుకునేందుకు సిద్ధంగా ఉంది.   తాజా గణాంకాల ప్రకారం, బీజేపీ 17 స్థానాల్లో విజయం సాధించి, 98 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఇప్పటి వరకు ఐదు స్థానాల్లో విజయం సాధించి 64 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.  ఇక్కడ ప్రభుత్వం  ఏర్పాటు చేయాలంటే  మేజిక్‌ ఫిగర్‌ ఒక పార్టీకి 101 స్థానాలు కావాల్సి ఉంది. అయితే  రాజస్థాన్‌లో బీజేపీ  తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకుంటుంది అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో  సీఎం రేసులో ఉన్న పేర్లు 

వసుంధర రాజే: రాజస్థాన్ తొలి మహిళా ముఖ్యమంత్రి ,ఐదుసార్లు ఎంపీగా ఎన్నికైన రాజే ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. 2003 నుండి రాజస్థాన్‌లోని ఝల్రాపటన్ సీటును నిలబెట్టు కుంటూ వస్తున్నారు. 2018 ఎన్నికలలో బీజేపీ ఓటమి తర్వాత, రాజే పార్టీ సమావేశాలు, కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కానీ  ప్రస్తుత ఎన్నికల్లో  ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టాలని రాజే మద్దతుదారులు పిలుపునిచ్చినప్పటికీ, బీజేసీ అగ్ర నాయకత్వం పెద్దగా ఆసక్తి కనబర్చలేదు.

గజేంద్ర సింగ్ షెకావత్: 56 ఏళ్ల కేంద్ర మంత్రి , బీజేపీకి చెందిన ప్రముఖ రాజ్‌పుత్ నాయకుడు గజేంద్ర సింగ్ షెకావత్  సీఎం రేసులో ఉన్న మరో కీలక అభ్యర్థి.  రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్‌  కుమారుడు వైభవ్‌ను ఓడించి జోధ్‌పూర్ నుండి 2019 లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించడంతో అతని ప్రాముఖ్యత పెరిగింది.

అర్జున్ రామ్ మేఘ్వాల్: రాజస్థాన్ ముఖ్యమంత్రి స్థానానికి కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మరో  ముఖ్యమైన  పోటీదారు అని చెప్పొచ్చు.  ప్రధానమంత్రి మోడీతో బలమైన బంధంతో, మూడుసార్లు పార్లమెంటేరియన్ అయిన మేఘవాల్ రాజస్థాన్‌లోని దళిత ముఖాలలో ఒకరిగా కనిపిస్తారు.

దియా కుమారి: 'జైపూర్ కి బేటీ' దియా కుమారి కూడా ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన రేసులో ప్రధానంగా  వినిపిస్తున్న పేరు.  జైపూర్ రాజకుటుంబంలో యువరాణిగా జన్మించిన దియా, సెప్టెంబరు 10, 2013న అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ , వసుంధర రాజే సమక్షంలో బీజేపీలో చేరారు. ఆ తర్వాత రాష్ట్ర, లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆమె విజయకేతనం ఎగురవేశారు.

బాలక్‌నాథ్ యోగి: రోహ్‌తక్‌లోని బాబా మస్త్‌నాథ్ మఠానికి చెందిన మహంత్ బాబా బాలక్‌నాథ్, తిజారా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఆయన దాదాపు 10707 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ఖాన్‌పై విజయం సాధించారు. బాబా బాలక్‌నాథ్‌ను రాజస్థాన్ ముఖ్యమంత్రిని చేయాలని సాధువులు డిమాండ్ చేశారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాదిరిగానే, బాలక్‌నాథ్ నాథ్ కమ్యూనిటీకి చెందినవాడు. అల్వార్‌లో పాపులర్‌ అయిన నేత. 6 ఏళ్ల వయసులోనే సన్యాసం స్వీకరించిన వ్యక్తి.  తన సేవ ద్వారా సమాజానికి తోడ్పడాలనే తన జీవితకాల ఆకాంక్షను బాలక్‌నాథ్  చాలా సార్లు ప్రకటించారు.

సతీష్ పూనియా: అయితే అంబర్ నియోజకవర్గం నుంచిపోటీచేసిన  సతీష్ పూనియా కాంగ్రెస్ అభ్యర్థి ప్రశాంత్ శర్మ చేతిలో ఓడిపోయారు. దీంతో ఈయన సీఎం రేసు నుంచి  తప్పుకున్నట్టే.

తాజా ఫలితాలు
తాజా ఈసీ సమాచారం ప్రకారం  బీజేపీ 71 స్థానాల్లో విజయం సాధించగా,  44 చోట్ల ఆధిక్యంలోఉంది. అలాఏ  కాంగ్రెస్‌ 39 స్థానాల్లో విజయం సాధించగా 30  చోట్ల ఆధిక్యంలో ఉంది. అలాగే భారత ఆదివాసీ పార్టీ 2 స్థానాల్లో గెలుపొందగా, 3 చోట్ల ఆధిక్యంలో ఉంది. బీఎస్‌పీ ఒక చోట విజయం సాధించగా, మరో స్థానంలో లీడింగ్‌లో ఉంది. 
 

మరిన్ని వార్తలు