కర్ణాటక: కాంగ్రెస్‌ గెలుపు సరే.. వాటి అమలుకు ప్రతి ఏడాది రూ.62 వేల కోట్లు?

16 May, 2023 15:31 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటకలో అధికార బీజేపీని ఓడించిన కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ విజయం సాధించడం వెనుక అనేక విభిన్న అంశాలు ఉన్నప్పటికీ.. ముఖ్యంగా మేనిఫెస్టోలో ప్రకటించిన ఉచిత పథకాలు మాత్రం సానుకూల ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. ఇక్కడి వరకు అంతా బాగున్నప్పటికీ ఎన్నికల సమయంలో ప్రకటించిన పథకాలను అమలు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీకి ఏడాదికి సుమారు రూ.62వేల కోట్ల వ్యయం అవుతోందని అంచనా.

తాము అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో ఇచ్చిన గ్యారంటీలు నెరవేరుస్తామని హామి  ఇచ్చిన హస్తం పార్టీ.. అందులో భాగంగా ప్రతి మహిళా కుటుంబ పెద్దకు నెలకు రూ.2వేలు, నిరుద్యోగ డిప్లొమా హోల్డర్‌కు రూ.1500, పట్టభద్రులకు నెలకు రూ.3వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న బస్సుల్లో మహిళలు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించింది. అలాగే ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామన్నారు. ఈ ప్రయోజనాలు డీప్ సీ ఫిషింగ్ కోసం ప్రతి సంవత్సరం 500 లీటర్ల పన్ను రహిత డీజిల్, ఫిషింగ్ సెలవు సమయంలో లీన్ పీరియడ్ అలవెన్స్‌గా సముద్ర మత్స్యకారులందరికీ రూ. 6,000 వంటి ఇతర వాగ్దాన ప్రయోజనాలకు అదనంగా ఉంటాయని ప్రకటించింది.

ఆవు పేడను కిలో రూ. 3 చొప్పున కొనుగోలు చేస్తామని, గ్రామీణ మహిళలు/యువకులతో కూడిన గ్రామాల్లో కంపోస్ట్/ఎరువు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఇలా కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ప్రభుత్వానికి ఏటా రూ.62వేల కోట్ల ఖర్చు అవుతుందని.. ఇది ఆ రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు 20శాతంతో సమానమని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి పనులు, కొత్త ప్రాజెక్ట్‌లతో పాటు ఉచిత పథకాలకు బడ్జెట్‌ కేటాయింపులుతో కాంగ్రెస్‌  ఏ మేరకు పరిపాలనను ముందుకు తీసుకెళ్తుందో చూడాలి.

మరిన్ని వార్తలు