ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌ స్కామ్‌: నేడు లాలూను ప్రశ్నించనున్న సీబీఐ.. ఆందోళనకు సిద్ధమైన ఆర్జేడీ

7 Mar, 2023 08:32 IST|Sakshi

ఢిల్లీ: ఆర్జేడీ అధినేత, బీహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను నేడు సీబీఐ ప్రశ్నించనుంది. ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు సంస్థ ఇదివరకే ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. సోమవారం ఆయన సతీమణి రబ్రీదేవిని సీబీఐ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్నంతా పాట్నాలో ఆర్జేడీ వర్గాలు ధర్నాకు దిగగా.. ఇవాళ ఆ ఆందోళనలను కొనసాగించాలని నిర్ణయించాయి.

2008-09 మధ్య రైల్వే బోర్డు రిక్రూట్‌మెంట్‌లకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు సీబీఐ గుర్తించింది. ఐఆర్‌సీటీసీలో గ్రూప్‌ డీ సంబంధిత పోస్టులను దొడ్డిదోవన కొందరికి కట్టబెట్టినట్లు తేల్చింది. ఆ సమయంలో రైల్వే మంత్రిగా లాలూ ఉన్నారు. ఉద్యోగాలు ఇప్పించినందుకుగానూ.. కొంతమంది అభ్యర్థుల నుంచి కారుచౌక ధరకే భూములు పొందారన్న అభియోగాలు లాలూ కుటుంబ సభ్యులపైనా నమోదు అయ్యాయి. ఈ వ్యవహారానికి సంబంధించి కిందటి ఏడాది మే నెలలో సీబీఐ కేసు నమోదు చేసి.. అక్టోబర్‌ నెలలో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.  

కేసులో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కూతుళ్లు మీసా, హేమలతో పాటు మరికొందరి పేర్లను చేర్చింది. మరోవైపు భూములు అప్పజెప్పి.. ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకున్న 12 మంది పేర్లను సైతం ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ చేర్చింది. ఈ మేరకు సోమవారం రబ్రీ దేవిని సుమారు ఐదు గంటలపాటు ప్రశ్నించి, ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు సీబీఐ అధికారులు. ఆ సమయంలో బయట ఆర్జేడీ వర్గాలు ఆందోళన చేపట్టాయి.

ఇక ఈ స్కాంకు సంబంధించి గతంలో లాలూకు ఓఎస్‌డీ(ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ)గా పని చేసిన భోళా యాదవ్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఇప్పటికే లాలూ కుటుంబాన్ని ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి పొందింది సీబీఐ. ఇదిలా ఉంటే.. వారం కిందట ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం ఢిల్లీ కోర్టులో లాలూ, ఇతరులు హాజరయ్యారు కూడా. 

గత కొంతకాలంగా లాలూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్ది నెలల క్రితం సింగపూర్‌లో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు.

మరిన్ని వార్తలు