BSNL Data Breach: డార్క్‌వెబ్‌లో ‘బీఎస్‌ఎన్‌ఎల్‌’ యూజర్ల డేటా

24 Dec, 2023 06:41 IST|Sakshi

చోరీ చేసిన హ్యాకర్‌

ఆన్‌లైన్‌లో పలు వివరాలు ప్రత్యక్షం

న్యూఢిల్లీ: బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్‌ వినియోగదారుల సమాచారాన్ని చోరీచేసిన ఓ హ్యాకర్‌ ఆ వివరాలను ఆన్‌లైన్‌లో విక్రయానికి పెట్టాడు. దీంతో ఆయా కస్టమర్ల గోప్యతకు విఘాతం కలిగింది. తనను ‘పెరిల్‌’గా పేర్కొన్న ఓ హ్యాకర్‌.. డార్క్‌వెబ్‌లో ఆ సమస్త వివరాలను పొందుపరిచాడు. దీంతో యూజర్ల గుర్తింపు బహిర్గతమవడంతోపాటు వారి సమాచారం సాయంతో మరో ఆర్థిక మోసం, ఆన్‌లైన్‌మోసానికి ఆస్కారం ఏర్పడింది. దాదాపు 29 లక్షల వరుసల డేటాను సంపాదించానని హ్యాకర్‌ తన డార్క్‌వెబ్‌ పేజీలో పేర్కొన్నాడు. శాంపిల్‌గా మొదట 32,000 లైన్ల డేటాను అందరికీ కనిపించేలా పెట్టాడు.

ఆయా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫైబర్, ల్యాండ్‌లైన్‌ యూజర్ల పేరు, ఈమెయిల్‌ ఐడీ, బిల్లుల సమాచారం, ఫోన్‌ నంబర్లు, ఇతర వ్యక్తిగత డేటాను వెబ్‌సైట్‌లో విక్రయానికి పెట్టాడు. కస్టమర్‌ ఇన్ఫర్మేషన్, నెట్‌వర్క్‌ వివరాలు, ఆర్డర్లు, హిస్టరీ అందులో ఉన్నాయి. డేటా చోరీతో వెంటనే అప్రమత్తమై తమ యూజర్ల డేటా రక్షణకు బీఎస్‌ఎన్‌ఎల్‌ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరిగాయి. ‘ ఇది బీఎస్‌ఎన్‌ఎల్‌కు, దాని వినియోగదారులపై విస్తృతస్థాయిలో దు్రష్పరిణామాలు చూపిస్తుంది’ అని సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు, ఇండియా ఫ్యూచర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు కనిష్క్ గౌర్‌ ఆందోళన వ్యక్తంచేశారు. 

>
మరిన్ని వార్తలు