ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగింట మహావికాస్‌ ఆఘాడి విజయం

5 Dec, 2020 09:08 IST|Sakshi

3 పట్టభద్రులు, 2 టీచర్లు, ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు విడుదల 

నాగపూర్‌లో బీజేపీకి పరాభవం.. ఆఘాడికి సొంతమైన పట్టభద్రుల స్థానం 

ఇది అందరి కృషితోనే సాధ్యమైందన్న మహావికాస్‌ అఘాడి నాయకులు 

 పరస్పరం స్వీట్లు పంచుకున్న ఆఘాడి కార్యకర్తలు

సాక్షి, ముంబై: రాష్ట్ర శాసన మండలిలో ఖాళీ అయిన స్థానాలకు డిసెంబర్‌ 1న జరిగిన ఎన్నికల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. మొత్తం ఆరు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నాలుగు స్థానాలు మహావికాస్‌ ఆఘాడి (కాంగ్రెస్‌–ఎన్సీపీ–శివసేన), ఒక స్థానం బీజేపీ కైవసం చేసుకుంది. మరోక స్థానంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి గెలుపొం దారు. రాష్ట్రంలోని 3 పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలతో పాటు ఒక స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించిన అనంతరం జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రావడంతో మహావికాస్‌ ఆఘాడిలో నూతన ఉత్సాహం నిండింది.

డిసెంబర్‌ 1న జరిగిన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ప్రారంభంకాగా బీజేపీకి తొలి విజయం దక్కి న సంగతి తెలిసిందే. ధులే–నందుర్బార్‌ స్థానిక సంస్థ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అమరీష్‌ పటేల్‌ గెలుపొందారు. అయితే మిగిలిన స్థానాల్లో బీజేపీ ఓటమిపాలైంది. ముఖ్యంగా పెట్టని కోటగా ఉండే నాగపూర్, పుణే, ఔరంగాబాద్‌లలో బీజేపీకి షాక్‌నిస్తూ మహావికాస్‌ ఆఘాడి విజయ ఢంకా మోగించింది. దీంతో ఆఘాడి కార్యకర్తల్లో హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుకున్నారు. మరోవైపు ఊహించని ఫలితాలపై బీజేపీ కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొంది.  (చదవండి:  ముంబై విజయం.. ఆడిపాడిన రణ్‌వీర్‌) 

పుణేలో... 
పుణే పట్టభద్రుల నియోజకవర్గంలో మహావికాస్‌ ఆఘాడికి చెందిన ఎన్సీపీ అభ్యర్థి అరుణ్‌ లాడ్‌ విజయం సాధించారు. ఆఘాడి విజయంతో సుమారు 20 ఏళ్ల అనంతరం బీజేపీ కోటకు బీటలు వారాయని చెప్పవచ్చు. ముఖ్యంగా అరుణ్‌ లాడ్‌ తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సంగ్రామ్‌ సింగ్‌ దేశ్‌ముఖ్‌పై 48,824 మెజార్టీలతో విజయం సాధించారు. గెలుపుకోసం 1,14,137 ఓట్ల అవసరం ఉండగా అరుణ్‌ లాడ్‌కు 1,22,145 ఓట్లు వచ్చాయి. మరోవైపు బీజేపీ అభ్యర్థి సంగ్రామ్‌సింగ్‌ దేశ్‌ముఖ్‌కు 73,321 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో మాత్రం బీజేపీ అభ్యర్థి సంగ్రామ్‌ సింగ్‌ దేశ్‌ముఖ్‌ ముందంజలో కొనసాగారు. ఆ తర్వాత మహావికాస్‌ ఆఘాడి అధిక్యతను కనబరుస్తూ విజయం సాధించారు. 

60 ఏళ్ల కోటకు బీటలు..  
బీజేపీ ప్రధాన కార్యాలయంతో పాటు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తదితర దిగ్గజాల సొంత నియోజకవర్గాలైన నాగపూర్‌లో బీజేపీకి మహావికాస్‌ ఆఘాడి షాక్‌నిచ్చింది. సుమారు 60 ఏళ్ల అనంతరం నాగపూర్‌లో బీజేపీ పరాజయం పాలైంది. ఈ నియోజకవర్గంలో మహావికాస్‌ ఆఘాడికి చెందిన కాంగ్రెస్‌ అభ్యర్థి అభిజిత్‌ వంజారీ తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సందీప్‌ జోషిపై విజయం సాధించారు. 1958 నుంచి అక్కడ బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తూ వచ్చేవారు. ప్రస్తుతం ఆఘాడి ప్రభుత్వం వారికోటలను బీటలువేసింది. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ తండ్రి గంగాధర్‌ రావు ఫడ్నవిస్‌ కూడా గతంలో ఈ నియోజకవర్గం నుంచే విజయం సాధించారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వరుసగా నాలుగు సార్లు ఈ పట్టభద్రుల సంఘం నుంచి గెలుపొందారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్య కార్యాలయం ఉన్న నాగపూర్‌లో మహావికాస్‌ ఆఘాడి బీజేపీకి గట్టి దెబ్బవేసింది.  

ఔరంగాబాద్‌లో.. 
అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన మరాఠ్వాడా (నాగపూర్‌) పట్టభద్రుల నియోజకవర్గంలో మహావికాస్‌ ఆఘాడికి చెందిన ఎన్సీపీ అభ్యర్థి సతీష్‌ చవాన్‌ విజయం సాధించారు. తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి శిరీష్‌ బోరాల్కర్‌పై 57,895 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో విజయం కోసం 1,09,409 అవసరం కాగా సతీష్‌ చవాన్‌కి 1,16,638 ఓట్లు లభించాయి. బీజేపీ అభ్యర్థి శిరీష్‌ బోరాల్కర్‌కు కేవలం 58,743 ఓట్లు లభించాయి. పుణే ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఆఘాడి అభ్యర్థి గెలువగా, అమరావతి టీచర్‌ నియోజకవర్గంలో వాషిమ్‌కి చెందిన విద్యావేత్త స్వతంత్ర అభ్యర్థి అయిన కిరణ్‌  గెలుపొందారు.  

ఆఘాడి ప్రభుత్వాన్ని ప్రజలు స్వీకరించారు..: పవార్‌ 
మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వాన్ని ప్రజలు స్వీకరించారనడానికి ఈ ఫలితాలు రుజువు అని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఫలితాలు మహావికాస్‌ ఆఘాడికి అనుకూలంగా రావడంపై ఆయన తనదైన శైలిలో బీజేపీకి చురకలంటించారు. ధులే–నందుర్బార్‌లో వెలుపడిన ఫలితంపై ఎవరు ఆశ్చర్యపోనక్కరలేదన్నారు. బీజేపీకి గత ఏళ్లుగా పెట్టనికోటగా ఉన్న నాగపూర్, పుణే తదితర నియోజకవర్గాల్లో బీజేపీ ఓటమిపాలైంది. అక్కడి ప్రజలు మహావికాస్‌ ఆఘాడి అభ్యర్థిని గెలిపించడంతో బీజేపీని దూరం పెట్టినట్టు అర్థం చేసుకోవాలన్నారు. అదేవిధంగా మహారాష్ట్ర రాజకీయాల్లో ఇది మార్పుకు నాందిగా ఆయన అభివర్ణించారు. 

వారి బలాన్ని అంచనా వేయలేకపోయాం..: ఫడ్నవిస్‌ 
ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయడంతో వారి బలాన్ని అంచనా వేయడంలో తప్పు జరిగిందని బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ అన్నారు. తమకు పెట్టని కోటగా ఉన్న నాగపూర్, పుణేలో ఆఘాడి గెలవడం బీజేపీకి తీవ్ర నష్టమని పేర్కొన్నారు. ఆరు స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో ఒక స్థానంతో బీజేపీ సంతృప్తి పడాల్సి వచ్చిందన్నారు. అయితే ఈ ఫలితాలు తమకు ఊహించినట్టుగా రాలేదన్నారు. అయితే కూటమిలో భాగంగా ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు మాత్రమే గెలిచాయని, శివసేన ఒక్క స్థానం కూడా కైవసం చేసుకోలేకపోయిందని ఆ పార్టీకి ఫడ్నవిస్‌ చురకలంటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీకే ఒక్క సీటు దక్కకపోవడంపై శివసేన ఆత్మపరీక్ష చేసుకోవాలని ఫడ్నవిస్‌ సూచించారు. మరోవైపు మూడు పార్టీల్లో రెండు పార్టీలకే లాభం చేకూరందంటూ ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో మరింత బలంతో తమ పార్టీ రంగంలోకి దిగుతుందని పేర్కొన్నారు.  

సమష్టి కృషి...: అజిత్‌ పవార్‌ 
పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ప్రజలు మహావికాస్‌ ఆఘాడి అభ్యర్థులను గెలిపించడం వెనుక అన్ని పార్టీల సమష్టి కృషి ఉందని, ముఖ్యంగా తమ ఐక్యతే మమ్మల్ని గెలిపించిందని ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ పేర్కొన్నారు. పుణేలో 20 ఏళ్ల అనంతరం బీజేపీ పరాజయం చవిచూడాల్సి వచ్చిందన్నారు. నాగపూర్‌లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడిందన్నారు. అందరి కృషితోనే మహావికాస్‌ ఆఘాడి అభ్యర్థులు విజయం సాధించారన్నారు.

మరిన్ని వార్తలు