Maharashtra: 10 రోజుల్లో ఆలయాలు తెరవండి.. లేదంటే..

30 Aug, 2021 10:44 IST|Sakshi

ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన అన్నా హజారే 

సాక్షి, ముంబై: రాష్ట్రంలో కరోనా కారణంగా మూసివేసిన ఆలయాలన్నింటినీ పది రోజుల్లోగా తెరవాలని అన్నా హజారే డిమాండ్‌ చేశారు. లేకపోతే జైల్‌ భరో చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వివిధ వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, హోటళ్లు సహా వైన్‌ షాపులు కూడా తెరిచే ఉంటున్నాయని, ఆలయాలను తెరవడంలో ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిటని అన్నా హజారే నిలదీశారు. పది రోజుల్లో ఆలయాలను తెరవని పక్షంలో మందిర్‌ బచావ్‌ కృతి సమితి జైల్‌ భరో నిర్వహిస్తుందని, అందుకు తన మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం అమలు చేసిన లాక్‌డౌన్‌ ఆంక్షల వల్ల గత ఏడాదిన్నర నుంచి ప్రార్థనా స్థలాలన్నీ మూసే ఉంటున్నాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్‌ నియమాలను దశలవారీగా సడలిస్తున్నారు. దీంతో బార్లు, వైన్‌ షాపులు, హోటళ్లు, వివిధ వ్యాపార రంగ సంస్థలు అన్నీ పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. లాక్‌డౌన్‌ నియమాలకు కట్టుబడి జనాలు కూడా నిర్భయంగా ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. దీంతో ఆలయాలను కూడా తెరవాలని గత కొద్ది నెలలుగా ప్రజల నుంచి డిమాండ్‌ వస్తోంది.

వివిధ సేవా సంస్థలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ, ప్రభుత్వం ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు అనుమతినివ్వడం లేదు. దీంతో అహ్మద్‌నగర్‌ జిల్లాకు చెందిన మందిర్‌ బచావ్‌ కృతి సమితి బృందం రాళేగణ్‌సిద్ధి గ్రామంలో అన్నా హాజారేతో భేటీ అయి ఓ నివేదికను అందజేసింది. ఆ నివేదికను పరిశీలించిన హజారే, ఆలయాలను మూసివేసి ప్రభుత్వం ఏం సాధించిందని ప్రశ్నించారు. మందిరాలకు వచ్చే భక్తులు కోవిడ్‌ నియమాలు కచ్చితంగా పాటిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. దీంతో సాధ్యమైనంత త్వరగా ఆలయాలను తెరిచేందుకు అనుమతినివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  

చదవండి: BMC Election 2022: ఆ ఓట్లన్నీ బీజేపీకే.. చెక్‌ పెట్టేందుకు శివసేన.. 

మరిన్ని వార్తలు